ట్యాలెంటెడ్ నటుడు సత్యదేవ్ చేస్తోన్న పలు ప్రాజెక్టుల్లో గుర్తుందా శీతాకాలం ఒకటి. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను.. దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగిసి.. చాలాకాలమే అవుతోంది. ఎప్పట్నుంచో దీన్ని విడుదల చేయాలని, మేకర్స్ కసరత్తు చేస్తూనే ఉన్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఇది విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత ఈ సినిమాకు మోక్షం లభించబోతోంది.
లేటెస్ట్ అనౌన్స్‌మెంట్ ప్రకారం.. ఈ సినిమాను మేకర్స్ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు. ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఎలా ఉండబోతోందో చూడాలి? అసలు ఈ సినిమాకి సత్య దేవ్, తమన్నాల క్రేజీ కాంబోనే మెయిన్ ఎసెట్. చాలా ఫ్రెష్ జోడీ కావడం, చూడ్డానికి చూడముచ్చటగా ఉండడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ట్రైలర్ కూడా, ఒక అందమైన ఫీల్ ఇచ్చింది. ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ చూడబోతున్నామన్న అంచనాలు ఏర్పడ్డాయి. మరి, వాటిని అందుకోవడంలో ఇది సక్సెస్ అవుతుందా? శీతాకాలం లాంటి మంచి అనుభూతిని ఇవ్వగలుగుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
ఇదిలావుండగా.. ఈ సినిమాలో మేఘా ఆకాష్‌తో పాటు కావ్య శెట్టి కూడా కీలక పాత్రల్లో నటించారు. వీరిద్దరితోనూ సత్య దేవ్ లవ్ ట్రాక్ ఉండటాన్ని మనం ట్రైలర్‌లో గమనించవచ్చు. కాగా.. కాల భైరవ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను, శ్రీ వేదాక్షర మూవీస్ సంస్థ నిర్మించింది.
