God Father:ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఈ విజువల్ ట్రీట్ చోటు చేసుకుంది. ఈ సినిమా కోసం చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఇద్దరూ కలసి నటించిన “మార్ మార్.. తక్కర్ మార్.. తార్ మార్ తక్కర్ మార్..” అంటూ సాగే సాంగ్ ప్రోమో సెప్టెంబర్ 13న జనం ముందుకు వచ్చింది. అలా వచ్చిందో లేదో ఇలా ఇద్దరు మెగాస్టార్స్ ను చూడడానికి జనం రెచ్చిపోయారు. కొన్ని నిమిషాల్లోనే వ్యూస్ రేట్ పెరిగిపోసాగింది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ బ్లాక్ కలర్ షూట్స్ లో కనిపిస్తూ చేతులతో విన్యాసాలు చేయడం అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాటను భారీగా చిత్రీకరించినట్టూ తెలుస్తోంది. ఈ పాట పూర్తి భాగం సెప్టెంబర్ 15న విడుదల కానుంది.
మళయాళంలో మోహన్ లాల్ హీరోగా రూపొంది విజయం సాధించిన ‘లూసిఫర్’ ఆధారంగా ఈ ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సురేఖ కొణిదెల, ఆర్.బి.చౌదరి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ స్వరకల్పన చేశారు. దసరా కానుకగా ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా పాటల సందడి సాగనుంది. మరి 15వ తేదీన వచ్చే ‘మార్ మార్..’ సాంగ్ ను పూర్తిగా చూస్తే అభిమానులు ఏ స్థాయిలో రెచ్చిపోతారో!?
