Ghaati: ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది.. అంటూ కుర్రకారును తన అందాలతో మెస్మరైజ్ చేసిన సరోజ గుర్తుందా..? డబ్బు కోసం వేరే దారిలేక వేశ్యా వృత్తిలోకి వచ్చి.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, సొంతంగా ఎదగాలనుకొనే అమ్మాయి సరోజ. ఆ ప్రయాణంలో ఆమె ఎన్ని కష్టాలను ఎదుర్కొంది అనేది వేదం సినిమాలో చూపించాడు క్రిష్ జాగర్లమూడి. ఇక ఈ సినిమా వచ్చి ఎన్నేళ్లు అవుతున్నా.. సరోజ పాత్ర అందరి మనస్సులో గుర్తుండిపోతుంది. ఈ సినిమా కు క్రిష్ కు ఎంత పేరు వచ్చిందో స్వీటీకి కూడా అంతే పేరు వచ్చింది. ఒక స్టార్ హీరోయిన్ వేశ్యగా నటించడం అంటే అప్పట్లో మాములు విషయం కాదు. ఇక ఇప్పుడు వేదం కు మించి ఈ కాంబో రాబోతుంది. అవును.. స్వీటీ మరోసారి వేశ్యగా కనిపించబోతుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క మరోసారి నటించబోతుంది అని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. నిశబ్దం సినిమా తరువాత చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్కా.. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా స్వీటీకి మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది.
ఇక ఈ సినిమా తరువాత స్వీటీ వరుస సినిమాలను లైన్లో పెట్టింది. ఇప్పటికే కన్నడలో ఒక సినిమాను ఓకే చేసిన ఈ భామ.. ఇప్పుడు క్రిష్ తో మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. ఆ సినిమానే ఘాతీ. యూవీ క్రియేషన్స్ తో పాటు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాను అమెజాన్ ఈవెంట్ లో అధికారికంగా వెల్లడించారు. ఇక ఇందులో స్వీటీ మరోసారి వేశ్యగా కనిపించనుందని తెలుస్తోంది. పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుకున్న మహిళ.. తన సాధికారికతను చూపించుకోవడానికే ఎలా పోరాడింది అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఘాతీ అంటే లోయ. పైకి రాలేని లోయలో పడిన ఒక మహిళ.. తనను ఎలా కాపాడుకుంది అనేది కథగా చెప్పుకొచ్చారు. ఇక పోస్టర్ లో అనుష్క ముఖాన్ని చూపించలేదు కానీ, చీరను ముఖాన కప్పుకొని ఎడారిలో నడుస్తున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అనుష్క- క్రిష్.. వేదం కన్నా పెద్ద హిట్ ను అందుకుంటారో లేదో చూడాలి.
