లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడలో రిలీజ్ అవుతున్న ఈ సినిమను తెలుగులో రానా రిలీజ్ చేస్తుండగా తమిళ్ సూర్య, జ్యోతిక రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమ ట్రైలర్ ను స్టార్ హీరోలు రానా, నాని తమ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి సాయి పల్లవికి బెస్ట్ విషెస్ తెలిపారు. ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. “మేడమ్.. మీరు బ్రహ్మానందం పెద్ద కూతురు కదా”అంటూ మీడియా అడిగే ప్రశ్నలతో ట్రైలర్ మొదలైంది.
సెక్యూరిటీ గార్డు గా పనిచేసే బ్రహ్మానందం కు ఇద్దరు కూతుళ్లు.. అందులో పెద్ద కూతురు గార్గి(సాయిపల్లవి) టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది.. త్వరలోనే ఆమెకు పెళ్లి కూడా జరగబోతుండగా సడెన్ గా పోలీసులు బ్రహ్మానందం ను అరెస్ట్ చేస్తారు. కేసు ఏంటి..? అసలు అతను నేరం చేశాడా..?ఆ నేది కుటుంబంలో ఎవరికి తెలియదు. దీంతో తండ్రి కోసం గార్గి చేసిన పోరాటమే..? కథగా తెలుస్తోంది.ఇంతకీ సాయి పల్లవి తండ్రి చేసిన తప్పు ఏంటీ..? ఒక్కరోజులోనే గార్గి జీవితాన్ని తలకిందులు చేసింది ఎవరు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక సాయి పల్లవి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి పాత్ర దొరకాలే కానీ సాయి పల్లవి జీవించేస్తోంది అని ఆమె నటించిన సినిమాలే చెప్తుంటాయి. ఇక గోవింద్ వసంత నేపధ్య సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇక చివర్లో “నన్ను నమ్మవు అమ్మ నువ్వు.. ఎందుకంటే నేను మగపిల్లాడిని కాదు కదా.. ఆడపిల్లను” అంటూ సాయి పల్లవి చెప్పిన ఎమోషనల్ డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మొత్తానికి ట్రైలర్ తోనే దర్శకుడు హైప్ పెంచేశాడు. మరి జూలై 15 న గార్గి ఏ రేంజ్ లో సక్సెస్ ను అందుకోనున్నదో చూడాలి.
