బాలీవుడ్ భామ ఆలియా భట్ తాజా చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ వంద కోట్ల క్లబ్ లో ఎంటరైంది. త్వరలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఎలాగూ తొలి రోజే ఆ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అలియా ఇప్పుడు హాలీవుడ్ ప్రాజెక్ట్ తో రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇండియా అలియా భట్ తో ఓ ఓటీటీ ఫిల్మ్ తీయనుంది. ఇందులో ‘వండర్ వుమన్’ ఫేమ్ గాల్ గడోట్ కూడా నటించబోతోంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇదో అంతర్జాతీయ స్పై థ్రిల్లర్. గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించే ఈ సినిమాలో అలియా యాక్షన్‌తో కూడిన పాత్రలో కనిపిస్తుందట.
ఇంతకు ముందు హాలీవుడ్ సంస్థలు తీసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె నటించారు. ఇప్పుడు ఓటీటీ మూవీలో అలియా నటించనుండటం విశేషం. బాలీవుడ్ లో బిజీగా కొనసాగుతూనే టాలీవుడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ పూర్తి చేసింది. తను నటించిన ‘బ్రహ్మాస్త్ర’ కూడా విడుదల కావలసి ఉంది. ఇక ఎన్టీఆర్-కొరటాల చిత్రంతో పాటు రాజమౌళి తదుపరి చిత్రంలో కూడా అలియా భాగమని వినిపిస్తోంది. మరి హాలీవుడ్ మూవీ హిట్ అయితే అలియా కూడా ప్రియాంకలా అక్కడే సెటిల్ అవుతుందేమో చూడాలి.
