NTV Telugu Site icon

Forty Years for Krishnavataram : నలభై ఏళ్ళ బాపు ‘కృష్ణావతారం’

Krishna Avataram

Krishna Avataram

ప్రముఖ దర్శకులు బాపు తొలి కథానాయకుడు నటశేఖర కృష్ణ. బాపు తొలి చిత్రం ‘సాక్షి’తో కృష్ణకు నటునిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత దాదాపు తొమ్మిదేళ్ళకు బాపు దర్శకత్వంలో కృష్ణ నటించిన ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’ వచ్చింది. ఆపై ఆరేళ్ళకు బాపు-కృష్ణ కాంబోలో ‘కృష్ణావతారం’ వెలుగు చూసింది. 1982 సెప్టెంబర్ 22న ‘కృష్ణావతారం’ జనం ముందు నిలచింది. చిత్రకల్పన ఫిలిమ్స్ పతాకంపై ముళ్ళపూడి వెంకటరమణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇంతకూ ఈ ‘కృష్ణావతారం’ కథ ఏమిటంటే- గంగుల కృష్ణావతారం దొంగతనాలు చేస్తూ జీవిస్తూ ఉంటాడు. అతడంటే టీ కొట్టు గౌరికి ఎంతో ప్రేమ. ఊరిలో ఏ దొంగతనం జరిగినా ముందుగా కృష్ణావతారాన్ని అరెస్ట్ చేసి విచారిస్తుంటారు పోలీసులు. అతగాడు జైలుకు వెళ్తే అక్కడ శిష్యకోటి ‘వెల్ కమ్ గురూ…’ అంటూ సంబరాలు చేసుకొనేంత పేరున్నవాడు కృష్ణావతారం. షావుకారు జగన్నాథంకు ఇద్దరు కూతుళ్ళు. వారిలో పెద్దమ్మాయి విజయ భర్త లాయర్. పెద్దమ్మాయికి ఓ పాప ఉంటుంది. తాను చనిపోతే పాప బాధ్యత తీసుకోమని చెల్లెలు శాంతికి చెబుతుంది విజయ. చిన్నమ్మాయిని తన మిత్రుని కొడుక్కిచ్చి పెళ్ళి చేయాలని భావిస్తాడు జగన్నాథం. రోగిష్టి అయిన విజయ ఆసుపత్రిలో ఉంటుంది. పాప ఆలనాపాలనా శాంతి చూస్తుంటుంది. అదే అదను అనుకొని, ఆమె స్నానం చేస్తూండగా, బావ బరితెగించిన పశువు అవుతాడు. తరువాత నుంచీ శాంతి ముభావంగా ఉంటుంది. ఆమె నెలతప్పిందని తెలుస్తుంది. కానీ, అక్క కోసం నిజం దాచిపెడుతుంది. జగన్నాథం మిత్రుడు తన కొడుక్కి శాంతిని భార్యగా చేయాలని భావిస్తాడు. అందువల్ల ఇండియా రాగానే జగన్నాథాన్ని కలుస్తాడు. అయితే అతనితో ఆమె వేరే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడిందని అబద్ధం చెబుతాడు జగన్నాథం. వధూవరులను వచ్చి ఆశీర్వదిస్తానంటాడు ఆయన మిత్రుడు. దాంతో వరుడిగా నటించమని కృష్ణావతారాన్ని తీసుకువెళతాడు లాయర్. తన చెల్లెలి పెళ్ళి కోసం ఏమైనా చేస్తానని కృష్ణావతారం సరేనంటాడు. పది రోజులు జగన్నాథం అల్లుడిగా నటించడానికి ఒప్పుకుంటాడు కృష్ణ. అనుకోకుండా అదే ఇంట్లో గౌరి పనిమనిషిగా రావలసి వస్తుంది. అన్ని విషయాలూ గౌరికి తెలుస్తాయి. ఇద్దరూ కలసి ఆ ఇంటివారితో బాగానే ఉంటారు. గౌరిని వశపరచుకోవాలని జగన్నాథం కొడుకు ఆశిస్తూ ఉంటాడు. కృష్ణ వాడికి దేహశుద్ధి చేస్తాడు. అతని మంచితనం శాంతికి నచ్చుతుంది. శాంతి ఓ బాబుకు జన్మనిస్తుంది. ఆ బాబును తాకడానికి శాంతియే సంకోచిస్తుంది. కృష్ణ, బాబును ఎత్తుకొని లాలిస్తాడు. దాంతో గౌరికి కూడా అతనిపై అనుమానం వస్తుంది. ఆ పెద్దింటి అల్లుడిగానే కృష్ణ ఉండిపోతాడేమో అని గౌరి భావిస్తుంది. కృష్ణను చంపాలని చూస్తారు జగన్నాథం, అతని కొడుకు, అల్లుడు. ఆ ప్రయత్నంలో శాంతి కన్నుమూస్తుంది. చనిపోతూ బాబును కృష్ణావతారంకు అప్పగిస్తుంది. శాంతి చనిపోవడంతో ఆమె బావ లాయర్ కు పశ్చాత్తాపం మొదలవుతుంది. తానే ఆమెను చంపానని అంగీకరిస్తాడు. పోలీసులకు ఫోన్ చేయమంటాడు. కృష్ణ, గౌరితో కలసి బాబును తీసుకొని వెళ్ళడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి, విజయశాంతి, శ్రీధర్, కె.విజయ, పి.ఆర్. వరలక్ష్మి, రమణమూర్తి, ప్రసాద్ బాబు, వల్లం నరసింహారావు, పి.జె.శర్మ నటించారు. అతిథి పాత్రల్లో కాంతారావు, అల్లు రామలింగయ్య, రాళ్ళపల్లి కనిపించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- మాటలు ముళ్ళపూడి వెంకటరమణ సమకూర్చగా, పాటలను డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రాశారు. ఇంద్రగంటికి పాటల రచయితగా ఇదే తొలి చిత్రం కావడం విశేషం! కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. “మేలుకోరాదా కృష్ణా…”, “కొండగోగు చెట్టు కింద కోల్ కోల్…”, “ఇంట్లో ఈగల మోత…”, “సిన్నారి నవ్వు…”, “స్వాగతం గురూ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత శ్రీరమణ నిర్వహణ. ఈ చిత్రాన్ని ప్రముఖ రూపశిల్పి జయకృష్ణ సమర్పించారు. బాపు-రమణ కాంబోలో కృష్ణ నటించిన చివరి చిత్రంగా ‘కృష్ణావతారం’ నిలచింది.