NTV Telugu Site icon

Forty Five Years For Chanakya Chandragupta : నలభై ఐదేళ్ళ ‘చాణక్య-చంద్రగుప్త’

Forty five Years for Chanikya Chandra Gupta

Forty five Years for Chanikya Chandra Gupta

తెలుగునాట పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించి అన్నిటా ఘనవిజయాలను చవిచూడడమే కాదు, దర్శకునిగానూ ఆ నాలుగు తరహా చిత్రాలతో జైత్రయాత్ర చేసిన ఘనత నటదర్శకులు యన్.టి.రామారావుకు మాత్రమే దక్కింది. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘చాణక్య-చంద్రగుప్త’ ఆ రోజుల్లో చర్చోపచర్చలకు కేంద్రబిందువుగా నిలచింది. మంచి విజయాన్నీ సాధించింది. యన్టీఆర్ తో కలిపి ఏయన్నార్, శివాజీ గణేశన్ కూడా ఇందులో నటించడం వల్ల ‘పద్మశ్రీ’త్రయం నటించిన చిత్రంగానూ ‘చాణక్య-చంద్రగుప్త’ నిలచింది. 1977 ఆగస్టు 25న ‘చాణక్య-చంద్రగుప్త’ విడుదలయింది.

క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం కాలం నాటి కథతో ‘చాణక్య-చంద్రగుప్త’ రూపొందింది. నందమహారాజు పట్టమహిషి పుత్రులు, ఆయన దాసి ముర పుత్రుడు చంద్రగుప్తుడు వేరువేరుగా పెరుగుతారు. తల్లి పెంపకంలో చంద్రగుప్తుడు వీరుడుగా నిలుస్తాడు. నంద కుమారులు విలాసవంతులుగా, గాలి చేష్టలు చేస్తూ ఉంటారు. అఖండ భరతావనిపై పరాయివారి కన్నుఉందని వారిని ఎదుర్కోవడానికి తగిన చర్యలు చేపడితే మంచిదని అందుకు తగిన పథకరచన గురించి చెప్పడానికి నందుని కొలువుకు వెళతాడు చాణక్యుడు. అతనిని నందులు అవమానిస్తారు. దాంతో చాణక్యుడు వారిపై పగబట్టి, వారికి పోటీగా చంద్రగుప్తుని తీర్చిదిద్దుతాడు. మనదేశంపైకి గ్రీకువీరుడు అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడని తెలుసుకున్న చంద్రగుప్తుడు అతనిని అడ్డుకుంటాడు. వారిద్దరి మధ్య స్నేహం నెలకొనేలా చాణక్యుడు చేస్తాడు. చాణక్యుని స్థాయిలోనే ఆలోచనాశక్తి గల రాక్షసమంత్రి నందుల కొలువులో ఉంటాడు. అతడు తన సొంతకూతురు ఆశానే విషకన్యగా మార్చి, ఆమెను చంద్రగుప్తుని చంపడానికి ప్రయోగిస్తాడు. చాణక్యుడు అడ్డుకుని తన శిష్యుడైన చంద్రగుప్తుని రక్షిస్తాడు. కానీ, నిజంగానే చంద్రగుప్తుని ప్రేమించిన ఆశా చనిపోతుంది. చంద్రగుప్తునికి యుద్ధాల్లో బాసటగా నిలచిన పర్వతకుని కూతురు ఛాయను చంద్రగుప్తుడు పెళ్ళాడతాడు. చాణక్యుడు ‘అర్థశాస్త్రం’ పూర్తి చేయడంతో కథ ముగుస్తుంది.

ఈ నాటికీ అలెగ్జాండర్, చంద్రగుప్తుడు ఒకరినొకరు కలుకోలేదు అనేవారు ఎందరో ఉన్నారు. అలెగ్జాండర్ దండెత్తి వచ్చినప్పుడు అతడిని ఎదిరించినవాడు పోరస్ అని దాఖలాలు ఉన్నాయి. అయితే పోరస్ కంటే ముందే మౌర్యసామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడు విస్తరించాక, అలెగ్జాండర్ ఈ భూభాగాన్ని చూడటానికి వచ్చాడని మరికొందరి మాట. అదీగాక, అలెగ్జాండర్ సేన గురించి తెలుసుకున్న చంద్రగుప్తుడు అతని సైన్యంలో రహస్యంగా పనిచేశాడని, అతని ధైర్యసాహసాలకు మెచ్చి అలెగ్జాండర్ అతనితో స్నేహంచేశాడనీ కొన్ని కథలు వినిపిస్తాయి. గ్రీకు చరిత్రకారుడు ప్లుటార్చ్ ప్రకారం అఖండ భారతంపై అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినప్పుడు చంద్రగుప్తుడు ఆయనను కలుసుకున్నాడనీ తెలుస్తోంది. దీనిని ఆధారం చేసుకొనే యన్టీఆర్ ‘చాణక్య-చంద్రగుప్త’ కథ రూపొందించారు. ఏది ఏమైనా ‘చాణక్య-చంద్రగుప్త’ విడుదలైన రోజులలో చంద్రగుప్తుడు, అలెగ్జాండర్ కలుసుకున్నారా? లేదా? అన్న అంశంపై చర్చ బాగానే సాగింది.

ఈ చిత్రంలో చాణక్యునిగా నటించిన నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పేరు ముందుగా తెరపై కనిపిస్తుంది. తరువాత నడిగర్ తిలకం శివాజీగణేశన్ పేరు వస్తుంది. ఆ తరువాత ‘చాణక్య-చంద్రగుప్త’ టైటిల్, ఆ పై కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంటూ యన్.టి.రామారావు పేరు ప్రకటించారు. టైటిల్స్ చివరలో నిర్మాతగానూ యన్టీఆర్ పేరు వేశారు తప్ప ఆయన పేరు నటునిగా కనిపించదు. ఇందులో మంజుల, జయప్రద, యస్.వరలక్ష్మి, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, రావు గోపాలరావు, పద్మనాభం, ముక్కామల, జగ్గారావు, చలపతిరావు, హలం, జయమాలిని, జయకుమారి తదితరులు నటించారు.

‘చాణక్య-చంద్రగుప్త’ చిత్రానికి పింగళి నాగేంద్రరావు రచన చేయగా, డాక్టర్ సి.నారాయణ రెడ్డి పాటలు పలికించారు. ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పన చేశారు. నందమూరి హరికృష్ణ ఛీఫ్ కంట్రోలర్ గా వ్యవహరించారు. ఇందులోని “చిరునవ్వుల తొలకరిలో…”, “ఎవరో ఆ వీర చంద్రుడు ఎవరో…”, “ఇదే తొలి రేయి…”, “ఒకటా రెండా తొమ్మిది…”, “సిరి సిరి చిన్నోడే…”, “సికందర్ తూనే…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రం విజయవాడలో నేరుగా శతదినోత్సవం జరుపుకుంది.

ఆ రోజుల్లో యన్టీఆర్, ఏయన్నార్ సినిమాల మధ్య ఢీ అంటే ఢీ అని పోటీ సాగేది. అయితే వారిద్దరి మధ్యలో కొన్నిసార్లు విభేదాలు తలెత్తినా అవి టీ కప్పులో తుఫాను లాంటివే తప్ప, ఏ నాడూ చిలికి చిలికి గాలివాన సృష్టించిన దాఖలాలు లేవు. పరిశ్రమ అభివృద్ధి కోసం మద్రాసులో ఉంటూ యన్టీఆర్, హైదరాబాద్ లో ఏయన్నార్ నిర్ణయాలు తీసుకున్నప్పుడూ ఒకరిమాటకు ఒకరు విలువనిచ్చేవారు. 1975లో ఏయన్నార్ అనారోగ్యం పాలయిన తరువాత, ఆయన కోలుకోగానే రామానాయుడు ‘సెక్రటరీ’ చిత్రం నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం ‘సెక్రటరీ’. అప్పటికే రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై ‘తాతమ్మకల’ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించారు యన్టీఆర్. అందువల్ల తమ రామకృష్ణా స్టూడియోస్ చిత్రంలోనూ ఏయన్నార్ ను నటింప చేయాలని భావించారు యన్టీఆర్. 1963లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ తరువాత యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించలేదు. దాంతో చాలా గ్యాప్ తరువాత వారిద్దరూ కలసి నటించాలని భావించారు. అదే సమయంలో యన్టీఆర్ అభిమానులు ఏయన్నార్ ను సన్మానించడమూ అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు.

యన్టీఆర్ కు ఏ సినిమాకైనా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవడం అలవాటు. ఆ తరువాతే ఆయన సినిమా షూటింగ్ మొదలు పెట్టేవారు. కొండవీటి వేంకటకవి రచనతో ‘దానవీరశూర కర్ణ’, అంతకు ముందు పింగళి నాగేంద్రరావు రచనలో ‘చాణక్య-చంద్రగుప్త’ స్క్రిప్టులు సిద్ధం చేయించారు. ఏయన్నార్ ను ‘దానవీరశూర కర్ణ’లో శ్రీకృష్ణునిగా నటించమని రామారావు కోరారు. అయితే శ్రీకృష్ణునిగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న యన్టీఆర్ సినిమాలో తాను ఆ పాత్ర ధరించినా, జనం మెచ్చరని భావించిన ఏయన్నార్ ‘చాణక్య-చంద్రగుప్త’లో చాణక్యునిగా నటిస్తానని అన్నారు. దాంతో ‘చాణక్య-చంద్రగుప్త’ 1976లో మొదలయింది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులు జరిగాక, యన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి కన్నుమూశారు. ఆ తరువాత యన్టీఆర్ తాను ఎన్నో రోజులుగా తెరకెక్కించాలని భావించిన ‘దానవీరశూర కర్ణ’ను ఆరంభించారు. అలా ‘చాణక్య-చంద్రగుప్త’ కంటే ముందు యన్టీఆర్ దర్శకత్వంలోనే ఆయన త్రిపాత్రాభినయం చేసిన ‘దానవీరశూర కర్ణ’ చిత్రం విడుదలై విజయఢంకా మోగించింది. ‘దానవీరశూర కర్ణ’ పాటల పుస్తకం వెనకాల మా తదుపరి చిత్రం ‘చాణక్య-చంద్రగుప్త’ అంటూ యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ ఉన్న ఈ సినిమా స్టిల్ వేశారు. అలాగే ‘దానవీరశూర కర్ణ’ సమయంలోనే విడుదలైన మరో పౌరాణిక చిత్రం ‘కురుక్షేత్రం’ పాటల పుస్తకం వెనకాల ‘పద్మాలయా’ సంస్థ తమ తదుపరి చిత్రం ‘నరనారాయణులు’ అని ప్రకటించింది. అయితే ‘నరనారాయణలు’ వెలుగు చూడలేదు.

‘దానవీరశూర కర్ణ’లో శ్రీకృష్ణ కర్ణసుయోధన పాత్రల్లో యన్టీఆర్ నభూతో నభవిష్యత్ అన్న చందాన నటించారు. అందువల్ల ‘చాణక్య-చంద్రగుప్త’లోనూ రెండు పాత్రలూ రామారావే చేసి ఉంటే బాగుండేదని అభిమానులు భావించారు. తరువాతి రోజుల్లో యన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సమ్రాట్ అశోక’లో కాసేపు చాణక్యునిగా కనిపించారు.

యన్టీఆర్ చేయగలిగి ఉండీ, చాణక్య పాత్రను ఏయన్నార్ కు ఇవ్వడం పట్ల అప్పట్లో ఇరువైపుల అభిమానులు ఆనందించారు. ఈ సినిమాలో నటించినందుకు ఏయన్నార్ పారితోషికం పుచ్చుకోలేదు. తరువాత యన్టీఆర్ ను తమ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నటించమన్నారు. యన్టీఆర్ సరేనన్నారు. అలా యన్టీఆర్ కాల్ షీట్స్ తోనే ఏయన్నార్, జగపతి ఆర్ట్ పిక్చర్స్ తో కలసి ‘రామకృష్ణులు’ నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.