(అక్టోబర్ 5న గుత్తా రామినీడు జయంతి)
ఏది చేసినా కొత్తగా చేయాలి. పాతదానినైనా కొత్తగా చూపాలి. ఇలాంటి ఆలోచనలు మెండుగా ఉన్నదర్శకులు గుత్తా రామినీడు. మొదటి నుంచీ థింక్ అవుటాఫ్ ద బాక్స్
అనే ధోరణితో సాగారు రామినీడు. మనసులు తాకేలా చిత్రాలను రూపొందించడమే కాదు, తన చిత్రాలలో మనోవిజ్ఞానశాస్త్రం విషయాలనూ చూపించారాయన. రామినీడు తెరకెక్కించిన చిత్రాలు కొన్నే అయినా, ఈ నాటికీ ఆయనను తలచుకోవలసింది అందుకే!
గుత్తా రామినీడు 1927 అక్టోబర్ 5న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ పుస్తకాల పురుగు అనిపేరు సంపాదించారు. ఏది చదివినా, ఏది చూసినా దానిని మరోకోణంలో అయితే ఎలా ఉంటుందో ఆలోచించేవారు. కళలపట్ల ఎంతో అభిమానం గల రామినీడు 1954లో చిత్రసీమలో ప్రవేశించారు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన పల్లెటూరు, చరణదాసి
వంటి చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు. 1959లో మా ఇంటి మహాలక్ష్మి
చిత్రంతో దర్శకుడయ్యారు. హరనాథ్, జమున జంటగా నటించిన ఈ చిత్రం పూర్తిగా హైదరాబాద్ లో నిర్మితమైన తొలి తెలుగు చిత్రంగా చరిత్రలో నిలచింది. బెంగాల్ లో ఘనవిజయం సాధించిన దీప్ జ్వలే జాయ్
సినిమా ఆధారంగా తెలుగులో చివరకు మిగిలేది
చిత్రం రూపొందించారు. ఇందులో సైకియాట్రిక్ హాస్పిటలో పనిచేసే ఓ నర్సు తమ దగ్గర చేరిన మానసిక రోగులకు చికిత్సలో భాగంగా ప్రేమను పంచుతుంది. మానసిక రోగులకు మందులతో కాదు మనసుతో వైద్యం చేయాలనే సత్సంకల్పంతో సాగే ఆ ఆసుపత్రిలో ఆ నర్సు పలువురితో స్నేహంగా, ప్రేమగా ఉంటుంది. అయితే ఆ కారణంగా ఆమె మానసిక సంఘర్షణకు గురవుతుందన్నవిషయాన్ని ఎవరూ గుర్తించరు. చివరలో నేను నటించలేను. నాకు చేతకాదు...
అంటూ నర్సు పాత్ర చెబుతుంది. అంటే ఆమెకు కూడా ఓ మనసుంటుందని, దానికీ కొన్ని పరిమితులు ఉంటాయని చివరకు మిగిలేది
చెబుతుంది. సావిత్రి ఇందులో నర్సు పాత్ర పోషించారు. తాను నటించిన అన్ని చిత్రాల్లోకి చివరకు మిగిలేది
బెస్ట్ అని సావిత్రి పలుమార్లు చెప్పుకున్నారు.
తరువాత రామినీడు దర్శకత్వంలో ఏయన్నార్ హీరోగా కలిమిలేములు
రూపొందింది. అదీ ఆకట్టుకోలేక పోయింది. ఆ పై భానుమతి ప్రధాన పాత్రలో అనురాగం
తెరకెక్కించారు రామినీడు. ఈ సినిమాతోనే ఫైనాన్సియర్ గా డి.రామానాయుడు చిత్రసీమలో అడుగుపెట్టారు. చిత్తూరు నాగయ్య మేటి చిత్రాలలో ఒకటిగా నిలచిన భక్త పోతన
కథను రామినీడు తన కాలానికి అనుగుణంగా రూపొందించారు. రామినీడు భక్త పోతన
లో గుమ్మడి టైటిల్ రోల్ పోషించగా, శ్రీనాథునిగా ఎస్వీఆర్ కనిపించారు. ఈ సినిమా పరాజయం పాలయింది. అయినా, రామినీడు పాత కథనైనా కొత్తగా చెప్పాలన్న ఉద్దేశంతో మరో పీరియడ్ ఫిలిమ్ పల్నాటి యుద్ధం
తెరకెక్కించారు. 1947లో గూడవల్లి రామబ్రహ్మం ఆరంభించగా, ఎల్వీ ప్రసాద్ పూర్తి చేసిన పల్నాటి యుద్ధం
లో గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయునిగా, నాగమ్మగా కన్నాంబ నటించారు. ఆ చిత్రం విశేషాదరణ చూరగొంది. అదే కథతో 1966లో యన్టీఆర్ బ్రహ్మనాయునిగా, భానుమతి నాగమ్మగా రామినీడు పల్నాటియుద్ధం
తెరకెక్కించారు. నిజానికి ఈ చిత్రంలోబ్రహ్మనాయునిగా యన్టీఆర్ అభినయం నభూతో నభవిష్యత్ అన్న చందాన సాగింది. కన్నాంబతో భానుమతిని పోల్చి చూడగా, జనం కన్నాంబలాగా ఈమె చేయలేకపోయింది అన్నారు. పాత పల్నాటి యుద్ధం
కంటే కొన్ని సన్నివేశాలు ఇందులోనే బాగా తెరకెక్కించారనీ ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసా పత్రమూ లభించింది.
తరువాత రామినీడు దర్శకత్వంలో బంగారు సంకెళ్ళు, మూగప్రేమ
వంటి చిత్రాలు తెరకెక్కాయి. అవి కూడా అంతగా అలరించలేక పోయాయి. దాదాపు పదకొండు సంవత్సరాలు ఆయన మెగా ఫోన్ పట్టలేదు. 1982లో శోభన్ బాబు ద్విపాత్రాభినయంతో ప్రతీకారం
తెరకెక్కించారు. ఈ చిత్రం మంచి ఆదరణ చూరగొంది. ఆపై శోభన్ బాబుతోనే రామినీడు తెరకెక్కించిన రాజ్ కుమార్
అంతగా అలరించలేకపోయింది. భానుచందర్ హీరోగా రామినీడు తెరకెక్కించిన యజ్ఞం
అవార్డులతో పాటు, రివార్డులూ సొంతం చేసుకుంది. ఇదే రామినీడు దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం. కాళీపట్నం రామారావు రాసిన యజ్ఞం
నవల ఆధారంగానే ఈ సినిమా రూపొందింది. సన్నకారు రైతుల జీవనాన్ని ఈ కథ కళ్లకు కట్టినట్టు చెప్పింది. అదే తీరున రామినీడు యజ్ఞం
సినిమాను తెరకెక్కించారు.అన్ని దారులూ మూసుకుపోగా చివరకు అప్పు కింద తన కొడుకును పాలేరుగా మార్చడం ఇందులోని ప్రధానాంశం. రైతుగా నటించిన పి.ఎల్.నారాయణకు ఉత్తమ సహాయనటునిగా జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా బంగారు నంది కూడా దక్కింది. ఆ తరువాత మారిన కాలపరిస్థితులతో సాగలేక రామినీడు సినిమాలకు దూరంగా జరిగారు. 2009 ఏప్రిల్ 29న అనారోగ్యంతో రామినీడు కన్నుమూశారు. ఆయన చిత్రాల ప్రస్థావన ఈ నాటికీ సాగుతూనే ఉండడం విశేషం.