Film Chamber’s Secretary Mutyala Ramesh: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని సమస్యలు నిర్మాతలకు కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. మొన్నటివరకు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసన చేసిన విషయం విదితమే. ఇక మధ్యలో ఈ ఓటిటీ ప్రభావం ఎక్కువ పడడంతో తాము నష్టపోతున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇక తాజాగా వీటన్నింటి మీద ప్రొడ్యూసర్ గిల్డ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలకు చెక్ పెట్టాలని చూస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ ముత్యాల రమేష్, స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
“స్టార్ హీరోలు మాత్రం బాగుపడుతున్నారు.. మిగతా వారు సర్వనాశనం అయిపోతున్నారు. ఫేక్ కలెక్షన్స్ తో హీరోలు రెమ్యూనిరేషన్లు పెంచుకుంటున్నారు. డైరెక్టర్స్ కు కొత్త అవకాశాలు వస్తున్నాయి. నిర్మాతలు లాభపడుతున్నారు. మరి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంగతి.. వారు మొత్తానికి నాశనం అయిపోతున్నారు. కేవలం స్టార్ హీరోలు హ్యాపీగా ఉన్నారు.. వాటాదారులు బాధపడుతున్నారని” ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రమేష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అంటే ఇప్పటివరకు తమ స్టార్ హీరోలు చెప్పుకొనే కలెక్షన్స్ ఫేకా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇక తాజాగా నేడు ప్రొడ్యూసర్ గిల్డ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో భేటీ అయిన విషయం విదితమే. దాదాపు 25 మంది నిర్మాతల చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆ తుది నిర్ణయం తీసుకొనేవరకు షూటింగ్లు బంద్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయమై ప్రొడ్యూసర్ గిల్డ్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదో చూడాలి.
