NTV Telugu Site icon

Rocking Rakesh: ‘కెసిఆర్’ సినిమాలో కెసిఆర్ నటించారు.. టికెట్ రేట్స్ తగ్గించాం: హీరో రాకింగ్ రాకేష్

Kcr Interview

Kcr Interview

రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘కేశవ చంద్ర రమావత్’ (కెసిఆర్). గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. అన్నన్య కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ‘కేశవ చంద్ర రమావత్’ ఈనెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రాకింగ్ రాకేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

జబర్దస్త్ లో అందరిని నవ్వించే మీరు మీ తొలి సినిమాకి ఇలాంటి సీరియస్ సబ్జెక్టు ఎంచుకోవడానికి కారణం?
-ఒక కమెడియన్ ఏ పాత్రనైనా చేయగలడు. ఇంతకుముందు బ్రహ్మానందం గారు లాంటి నటులు బాబాయ్ హోటల్ సినిమాతో అది నిరూపించారు. అప్పట్లో చలంగారు లంబాడోళ్ళ రామదాసు అనే సినిమా చేశారు. కమెడియన్స్ ఎలాంటి క్యారెక్టర్ చేసిన ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలరు. అలా ఈ సినిమాని చేయడం జరిగింది. ఈ కథే నన్ను యాక్ట్ చేసేలా చేసింది.

ఈ సినిమాకి బిగినింగ్ లోనే ‘కెసిఆర్’ అనే టైటిల్ అనుకున్నారా?
-ఈ కథ రాసుకున్నప్పుడే ‘మేరా నామ్ కెసిఆర్’ అని పెట్టుకున్నాను. ఈ కథలో హీరో పేరు కేశవ చంద్ర రమావత్. దాన్ని కట్ చేస్తే కేసీఆర్ అవుతుంది. అయితే ఈ పేరుని వాడడం సులువు కాదు. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇనిషియల్. కచ్చితంగా నో అబ్జెక్షన్ లెటర్ కావాలి. అందుకే నా కథని పార్టీలో సబ్మిట్ చేసి ఈ టైటిల్ తీసుకురావడం జరిగింది.

ఇది ప్రత్యేకంగా ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఉద్దేశించి తీసిన సినిమానా?
-అలాంటి ఉద్దేశం ఉంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ సినిమా రావాల్సింది కదా. ఈ సినిమా కోసం ఎన్ని కష్టాలు పడ్డానో మీకు తెలుసు. ఒకవేళ నాకు పార్టీ అండ ఉంటే ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు కదా. పార్టీలకు అతీతంగా చేసిన సినిమా ఇది. ఇలాంటి కథలకి మీడియా, ప్రేక్షకులు ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను. బాలీవుడ్ లో ఫ్యాన్ అని ఒక సినిమా వచ్చింది. షారుక్ ఖాన్ ని చూడడానికి ఓ కుర్రాడు చేసే జర్నీ అది. ఇలాంటి సినిమాలకు కథే హీరో. అలా కథనే హీరోగా నమ్మి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో కెసిఆర్ గారి గురించి ఉంటుంది. దాంతో పాటు ఒక అద్భుతమైన కథ ఉంటుంది. నాకు ఏ పార్టీ లేదు. నా పార్టీ.. సినిమా పార్టీ. నా మీద ఉన్న ప్రేమతో రోజా గారు, హరీష్ రావు గారు, జానీ మాస్టర్, జబర్దస్త్ టీం అంతా ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. సినిమా అనేది అల్టిమేట్ గా అందర్నీ రంజింపజేసేలా ఉండాలి. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ సినిమా తర్వాత ఇలాంటి కథలు మరిన్ని వస్తాయి.

కెసిఆర్ గారు ఈ సినిమా చూశారా?
-కెసిఆర్ గారికి ఈ సినిమా చూపించాలనేది నా ప్రయత్నం. ఇందులో గోరేటి వెంకన్న గారు రాసిన పాట నన్ను కెసిఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లింది. గోరేటి వెంకన్న గారు బ్రహ్మాండమైన సాహిత్యం రాశారు. అది విని కెసిఆర్ గారు పిలిపించి మాట్లాడారు.

మీరు దాదాపు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా.. బిగినింగ్ లో సినిమా కష్టాలు గురించి తెలియదా?
-నిజంగా తెలియదండి. మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాకు పని ఇచ్చారు. ఏ కష్టం తెలియకుండా చూసుకున్నారు. నిజంగా మాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. సమయానికి అన్నీ కుదిరిపోయావే. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు దాదాపు 13 సంవత్సరాలు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారని, సినిమా కష్టాలు తెలియకుండా పెంచారని ఈ జర్నీలో అర్థమైంది. ఏదేమైనా సినిమా అంటే పాషన్ కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొని ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం ఆనందంగా వుంది.

ఈ కథని సింగిల్ లైన్ లో చెప్పాలంటే ?
-లంబాడీ కుటుంబంలో పుట్టిన ఒక కుర్రాడు, తన ఊర్లో జరుగుతున్న ఒక దారుణానికి చలించి, హైదరాబాదులో అడుగుపెట్టి, తన ఊరు కోసం ఏం చేశాడు ? తన ఊర్లో ఎలాంటి అవమానాలు పడ్డాడు? చివరికి ఆ ఊర్లో తను ఓ స్టార్ ఎలా అయ్యాడు? అనేది కథ. ఈ కథకి యదార్ధ సంఘటనల స్ఫూర్తి ఉంది.

సుజాత గారి సపోర్టు ఎలా ఉంది?
-సుజాత సపోర్ట్ లేకపోతే ఈ సినిమా పూర్తి అయ్యేది కాదు. ఆవిడ ప్రోత్సాహమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.

డైరెక్టర్ అంజి గారి గురించి ?
-పెన్ను పేపర్ ఉన్న ప్రతి ఒక్కరు కథ రాసుకుంటారు. కానీ దాన్ని విజువల్ గా తీయడమే గొప్ప. నేను అనుకున్న కథని స్క్రీన్ మీదకి తీసుకురావడంలో గరుడవేగ అంజి గారు చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. ఆయన సీనియార్టీ నాకు ఎంతగానో ఉపయోగపడింది. అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాని తీశారు. నా కథని వందరెట్లు అద్భుతంగా చూపించారు. చరణ్ అర్జున్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చాడు. బలగం మధుగారు నా సినిమాకి ఎడిటింగ్ చేశారు. బలగంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ నా సినిమాలో ఉన్నారు. అందుకే మరో బలగమంటున్నారు. ఇందులో తాగుబోతు రమేష్, సుజాత కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అద్భుతంగా అలరిస్తాయి. సత్య కృష్ణ గారి అమ్మాయి అన్నన్య కృష్ణన్ ఇందులో హీరోయిన్ గా చేశారు. కథనమ్మి ఈ సినిమా చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ విషయంలో సత్య కృష్ణ గారి ధన్యవాదాలు.

రేపు చాలా సినిమాలు వున్నాయి కదా.. ఈ కాంపిటేషన్ ని ఎలా చూస్తారు ?
-నా సినిమాలో కేసీఆర్ నటించారు. అదే నా సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొస్తుంది. ఆయనకి తెలీయకుండా ఆయన్ని పెట్టి సినిమా తీసా. ఈ సినిమాలో చాలా మ్యాజిక్కులు వున్నాయి. రేపు వస్తున్న అన్ని సినిమాలు చూడండి. అందులో నా ప్రయత్నాన్ని కూడా ఆశీర్వాదించండి. ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించాము. టికెట్ వందరూపాయిలే. సంధ్యా లాంటి థియేటర్స్ లో టికెట్ 80, 50 రూపాయిలే.

Show comments