Site icon NTV Telugu

Fifty Five Years Nindu Manasulu Movie : యాభై ఐదేళ్ళ ‘నిండుమనసులు’

Nindu Manasulu

Nindu Manasulu

(ఆగస్టు 11న ‘నిండుమనసులు’కు 55 ఏళ్ళు)
నటరత్న యన్టీఆర్ హీరోగా, దర్శకుడు యస్.డి.లాల్ తొలి చిత్రం ‘నిండుమనసులు’. దేవిక నాయికగా నటించిన ఈ చిత్రానికి ధర్మేంద్ర హిందీ సినిమా ‘ఫూల్ ఔర్ పత్థర్’ ఆధారం. యస్.వి.యస్. ఫిలిమ్స్ పతాకంపై యమ్. జగన్నాథరావు నిర్మించిన ఈ సినిమా 1967 ఆగస్టు 11న విడుదలై విజయం సాధించింది.

‘నిండు మనసులు’ కథ ఏమిటంటే – రాజు ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసం దొంగతనాలు చేసి ఉంటాడు. అయితే అతను ముక్కుసూటి మనిషి. అతనితో మరిన్ని నేరాలు చేయించాలని శేషు అనేవాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. రాజు ఇకపై నిజాయితీగా బతకాలని భావిస్తాడు. రాజు నివసించే కాలనీ వారందరికీ అతనంటే హడల్! సుశీల అనే అమ్మాయి ఆపదలో ఉంటే కాపాడి తన ఇంటికి తీసుకు వస్తాడు రాజు. ఆమె నిప్పులాంటిదని రాజు తెలుసుకుంటాడు. ఆమెను కాలనీ జనం నానా మాటలు అంటారు. రాజు అలా అన్నవారికి దేహశుద్ధి చేస్తాడు. అది తప్పని వారిస్తుంది సుశీల. అతను మారాలని భావిస్తాడు. సుశీలకు సైతం రాజు అంటే అభిమానం కలుగుతుంది. రాజు అంటే శేషు దగ్గర పనిచేసే డాన్సర్ రోజీకి ప్రాణం. అతనితోనే జీవించాలని కలలు కంటూ ఉంటుంది. రాజు ఇంటిలో ఉన్న సుశీలను చూసి అసూయ చెందుతుంది రోజీ. ఆమెను ఎలాగైనా అక్కడ నుంచి పంపాలని భావిస్తుంది. దాసు అనేవాడిని రాజు చంపినట్టు శేషు, రోజీ చిత్రీకరిస్తారు. దాంతో రాజు వారి మాట వినవలసి వస్తుంది. అయితే రాజు కుడిభుజం లాంటి చంటి, దాసు అనేవాడు బ్రతికే ఉన్నాడని నిరూపిస్తాడు. దాంతో శేషు, రోజీ భరతం పట్టాలనుకుంటాడు రాజు. కాల్పుల్లో రాజును రక్షించబోయి రోజీ మరణిస్తుంది. శేషును సుశీల తండ్రి రఘుపతి హత్యచేసి పారిపోతాడు. ఆ నేరం రాజుపై పడుతుంది. చివరకు కోర్టులో రఘుపతి వచ్చి తానే నేరం అంగీకరించడంతో రాజు నిర్దోషిగా విడుదలవుతాడు. రాజు, సుశీలను కాలనీవాళ్లు పూలదండలు వేసి గౌరవిస్తారు. దాంతో కథ సుఖాంతమవుతుంది.

రాజుగా యన్టీఆర్, సుశీలగా దేవిక, శేషుగా రాజనాల, రోజీగా ఎల్.విజయలక్ష్మి నటించిన ఈ చిత్రంలో రాజబాబు, వాణిశ్రీ, సత్యనారాయణ, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, ధూళిపాల, బాలయ్య, ప్రభాకర్ రెడ్డి, రావి కొండలరావు, సిహెచ్. కృష్ణమూర్తి, ఛాయాదేవి నటించారు. టి.వి.రాజు సంగీతం సమకూర్చగా, సి.నారాయణ రెడ్డి, కొసరాజు, దాశరథి పాటలు రాశారు. ఇందులోని “ఆపద మొక్కులవాడా… ఓ శ్రీనివాసా…” పాట ఈ నాటికీ అలరిస్తూనే ఉంది. “చిక్కని చెక్కిలి నీది…”, “లే లే లే లెమ్మన్నది…”,”నీవెవరో…నేనెవరో…”,”చిట్టి చిట్టి ఇటురావే…”, “అయ్యయ్యో అదిరిపోతున్నాను…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది.

‘నిండుమనసులు’లో యన్టీఆర్ వరైటీగా నడుస్తూ అలరించారు. తరువాతి రోజుల్లోనూ అదే నడకను కొన్ని చిత్రాలలో రిపీట్ చేసినా, ఇందులోని యన్టీఆర్ వాకింగ్ స్టైల్ అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఒరిజినల్ ‘ఫూల్ ఔర్ పత్థర్’కు కొన్ని మార్పులూ, చేర్పులూ చేసి ఈ ‘నిండుమనసులు’ రూపొందించారు. రిపీట్ రన్స్ లో కూడా ఈ సినిమా విశేషాదరణ పొందింది.

యస్.వి.యస్. ఫిలిమ్స్ సంస్థ ‘నిండు మనసులు’ విజయం సాధించగా, తరువాత యన్టీఆర్ హీరోగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “కలిసొచ్చిన అదృష్టం, నిండు హృదయాలు, నిండు దంపతులు” వంటి చిత్రాలు నిర్మించింది. రిపీట్ రన్స్ లోనూ ఈ నాలుగు చిత్రాలు నిర్మాత యమ్.జగన్నాథ రావుకు విశేషంగా వసూళ్ళు రాబట్టడం ఎంతో విశేషం!

Exit mobile version