NTV Telugu Site icon

Fifty Five Years for Marapurani Katha : వాణిశ్రీని అభినేత్రిగా నిలిపిన ‘మరపురాని కథ’!

Marapurani Katha Min

Marapurani Katha Min

Fifty Five Years for Marapurani Katha :

కళాభినేత్రిగా జనం మదిలో నిలచిన నాటి మేటి నటి వాణిశ్రీ అభినయ పర్వంలో మేలుమలుపు ‘మరపురాని కథ’అని చెప్పాలి. 1962లో యన్టీఆర్ ‘భీష్మ’లో ఓ చిన్న పాత్రతో చిత్రసీమలో ప్రవేశించిన వాణిశ్రీ ఆ పై పలు చిత్రాలలో కేరెక్టర్ యాక్టర్ గానూ, కమెడియన్ గానూ నటించారు. వాణిశ్రీకి నటిగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టి, ఆమె కెరీర్ కు బిగ్ బ్రేక్ ను ఇచ్చిన చిత్రంగా ‘మరపురాని కథ’ నిలచింది. ఈ సినిమా 1967 జూలై 27న విడుదలయింది. కృష్ణ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్ లాల్ నహతా, డూండీ ఈ సినిమాను నిర్మించారు.

‘మరపురాని కథ’ ఏమిటంటే – అమృతసర్ లో ఉన్న రఘు, చనిపోవాలనుకున్న రవిని రక్షిస్తాడు. రవి చనిపోవడానికి కారణం చెప్పడు. అయినా రఘు అతడిని ప్రాణస్నేహితునిగా ఆదరించి, ఓ కంపెనీలో మేనేజర్ గా చేరేలా చేస్తాడు. అక్కడే రవి, లత ప్రేమించుకుంటారు. వారికి రఘు దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాడు. లత తండ్రి కాశీ వెళ్తూ కూతురు బాధ్యతను రఘుకు అప్పగిస్తాడు. రఘు, లతను సొంత చెల్లెలిలా చూసుకుంటూ ఉంటాడు. అయినా లోకం రఘు, లతపై నిందలు వేస్తుంది. కానీ, రవి ఆ మాటలు నమ్మడు. మాధవరావు అనే షావుకారుకు రాధ, శాంతి కూతుళ్ళు. రాధ అందరితో కలుపుగోలుగా ఉండడంతో ఆమెపై కొందరు అబాండాలు వేస్తారు. అవి నిజమేనని కొందరు చెబుతారు. ఆ మాటలు విని, బ్రతకడం ఇష్టం లేక ఆమె అన్న రవి అమృత్ సర్ పోయి చనిపోవాలనుకుంటాడు. అతడే రఘు రక్షించిన రవి. రాధకు పెళ్ళి కాదేమో అని చింతతో ఉంటాడు మాధవరావు. రాధకు పెళ్ళి కాకుండా పుకార్లు పుట్టిస్తూ ఉంటాడు ఆమెకు తెలిసిన వరహాలు అనేవాడు. వాడిపై కేసు పెట్టాలనుకుంటాడు మాధవరావు. అతని ప్లీడర్ తన మిత్రుని కొడుకు రఘు, రాధను పెళ్ళి చేసుకుంటాడని చెబుతాడు. అమృత్ సర్ నుండి వచ్చి, రాధను చూసిన రఘు సరే అంటాడు. కానీ, తన మిత్రుడు రవి అంగీకరించాకే పెళ్ళి చేసుకుంటానని చెబుతాడు. రవికి రాధ ఫోటో పంపిస్తాడు. సొంత చెల్లెలే అయినా, రాధ మంచిది కాదని రఘుకు ఉత్తరం రాస్తాడు రవి. ఆ లెటర్ చూపించి, రఘు వెళ్ళిపోతాడు. తమ సొంత అన్నకారణంగానే అక్క పెళ్ళి చెడిపోయిందని భావించిన శాంతి రవికి ఉత్తరం రాస్తుంది. నీ వల్లే అక్క పెళ్ళి చెడిపోయిందని అందులో ఉంటుంది. రాధ స్వయంగా రవి చెల్లెలు అని రఘుకు తెలుస్తుంది. ఎవరు ఏమి చెప్పినా, రాధను పెళ్ళాడాలని వస్తాడు రఘు. కానీ, అప్పటికే ఆమె లోకం నిందలు భరించలేక పిచ్చిదై ఉంటుంది. వరహాలే ఆమెపై పుకార్లు పుట్టించాడని తెలిసి దేహశుద్ధి చేసి నిజం చెప్పిస్తాడు రఘు. రవి వచ్చి, వాడిని తానూ చితక్కొడతాడు. మాధవరావు తన కూతురు పెళ్ళిచెడిపోయిందని, అందుకు కొడుకే కారకుడని తెలిసి నానా మాటలు అంటాడు. ఆ మాటలు విని, రాధ తల్లడిల్లిపోతుంది. రఘు వచ్చి రాధను పెళ్ళాడతానంటాడు. శాంత వెళ్ళి అక్క రాధను తీసుకు వస్తుంది. అప్పటికే విషం మింగిన రాధ, రఘు చేతుల్లో కొరప్రాణంతో కొట్టుమిట్టాడుతుండగా, ఆమె సుమంగళిగా చావాలని రఘు, తాళిబొట్టు కడతాడు. అలా రాధ జీవితం అంతం కావడంతో కథ ముగుస్తుంది.

ఇందులో చంద్రమోహన్, చిత్తూరు వి.నాగయ్య, కాంచన, సంధ్యారాణి, నాగభూషణం, రావి కొండలరావు, చదలవాడ, కె.వి.చలం, చలపతిరావు, జూనియర్ భానుమతి, విజయలక్ష్మి తదితరులు నటించారు. ఈచిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణ రచన చేశారు. ఆరుద్ర, కొసరాజు, సినారె, అప్పలాచార్య పాటలు పలికించగా, టి.చలపతిరావు సంగీతం సమకూర్చారు.

ఈ చిత్రంలో “గంగా యమునా తరంగాలతో…” అంటూ మొదలయ్యే పాటలో కృష్ణ మహాకవి గురజాడ అప్పారావులా కనిపిస్తారు. ఈ సినిమాకు ఆదరణ లభించడంతో తరువాత వి.రామచంద్రరావు డైరెక్షన్ లో కృష్ణ హీరోగా రూపొందించిన ‘అసాధ్యుడు’లో ఆయనను అల్లూరి సీతారామరాజు గెటప్ లో చూపించారు. తరువాతి రోజుల్లో అదే వి.రామచంద్రరావు దర్శకత్వంలోనే కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’గా నటించి, ఘనవిజయం సాధించడం విశేషం! మరపురాని కథ తరువాత వాణిశ్రీ టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించారు. నాటి మేటి నటులందరి సరసన నాయికగా నటించి మెప్పించారు.

‘మరపురాని కథ’ చిత్రానికి తమిళంలో శివాజీగణేశన్, సావిత్రి నటించిన ‘కై కొడుత్త దైవమ్’ ఆధారం. తెలుగులో రూపొందాక 1970లో ప్రేమ్ నజీర్ హీరోగా మళయాళంలో ‘పలుంకు పాత్రం’ పేరుతోనూ, 1971లో అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీలో ‘ప్యార్ కీ కహానీ’గానూ రీమేక్ అయింది.

Show comments