NTV Telugu Site icon

కమల్ హాసన్ … ఆల్వేస్ ఏ లయన్!

Fans Celebrate 62 Years Of Kamalism

“అడవిలో ఉన్నా, బోనులో ఉన్నా సింహం సింహమేరా..” అంటూ ఓ చిత్రంలో ఎస్వీ రంగారావు నోట వెలువడిన మాటలు, ఆ తరువాత పలు చిత్రాల్లో పలకరించాయి. ఇప్పుడు కమల్ హాసన్ అభిమానులు ఆ మాటలనే పట్టుకొని, “ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అంటూ వల్లిస్తున్నారు. ఆగస్టు 12న కమల్ హాసన్ నటునిగా 62వ ఏట అడుగుపెట్టడంతో ఈ మాటలు మరింతగా సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. విషయానికి వస్తే – కమల్ హాసన్ బాలనటునిగా నటించిన తొలి చిత్రం ‘కలత్తూర్ కన్నమ్మ’ 1960 ఆగస్టు 12న విడుదలయింది. అంటే కమల్ నటునిగా జనం ముందునిలచి 61 ఏళ్ళు పూర్తయి, 62వ యేట అడుగుపెట్టారన్నమాట! ఈ సందర్భంగా కమల్ తాజా చిత్రం ‘విక్రమ్’ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులోనే ‘ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…’ అనే మాటలను జోడించారు. ఈ పదాలు కమల్ అభిమానులకు ఉత్సాహం కలగిస్తున్నాయి. ఈ సందర్భంగా కమల్ ను అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, సినీపరిశ్రమకు చెందిన పలువురు అభినందించారు.

నటునిగా కమల్ హాసన్ ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తున ఉన్నారని ఆయన సమకాలికులు సైతం అంగీకరిస్తారు. ఇక నేషనల్ అవార్డ్స్ లో తొలిసారి మూడు సార్లు ఉత్తమనటునిగా అవార్డులు సొంతం చేసుకుని చరిత్ర కెక్కారు కమల్. మొత్తం 19 ఫిలిమ్ ఫేర్ అవార్డులతోనూ అగ్రగామిగా సాగుతున్నారు కమల్. ఇంతటి నటజీవితం ఉన్న కమల్ ఎన్నెన్నో ఘనవిజయాలు చూశారు. పరాజయాలనూ పలకరించారు. ప్రయోగాలూ చేస్తూ సాగుతున్నారు. అయితే మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి కమల్ హాసన్ పరాజయం చవిచూశారు. ఆయన పార్టీ తరపున నించున్న అందరూ ఓటమి బాటనే పట్టారు. ఆయన కూడా ఓడిపోవడం అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగించిన మాట వాస్తవం. మళ్ళీ అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు అన్నట్టుగా ఇప్పుడు కమల్ హాసన్ తాజా చిత్రం ‘విక్రమ్’ పోస్టర్ విడుదలయింది. అందులో ‘ఒన్స్ ఏ లయన్… ఆల్వేస్ ఏ లయన్…” అనే మాటలు కమల్ ఫ్యాన్స్ కు ఉత్సాహం కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ అభిమానులను ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.