ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న ట్రెండ్ మరో ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా చేయనంత హంగామా.. రీ రిలీజ్ సినిమాలకు చేస్తున్నారు అభిమానులు. కొత్త సినిమాల కలెక్షన్స్ ఏంటో గానీ.. రీరిలీజ్ సినిమాల వసూళ్లతో మా హీరో తోపు అంటే, మా హీరో టాప్ అని గోల చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్ విషయంలో కొట్టేసుకున్నంత పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో #NonNTRRecords.. #NonPawanKalyanRecords అంటూ టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. గత వారం, పది రోజులుగా ట్విట్టర్‌ని కబ్జా చేసేశారు ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో.. దేవర టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇదే సమయంలో పవన్ నుంచి ఉస్తాద్, బ్రో సినిమాల అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్‌తో ఫాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇది అయిపోగానే.. రీ రిలీజ్ రికార్డుల లెక్కలతో కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 పైగా స్క్రీన్స్‌లలో రిలీజ్ చేశారు. దీని కోసం ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ విశ్వక్ సేన్ గెస్ట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు.
20 ఏళ్ల తర్వాత డిజిటల్ వెర్షన్‌తో మళ్లీ థియేటర్లోకి వచ్చిన సింహాద్రి సినిమా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఏకంగా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటున్నారు. గతంలో పవర్ స్టార్ ‘ఖుషి’ ఫస్ట్ డే 4 కోట్లకు గ్రాస్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ‘సింహాద్రి’ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ లెక్కలో తేడా ఉందనేది పవన్ ఫ్యాన్స్ మాట. ఇదే విషయంలో ఇరువురు ఫ్యాన్స్ గట్టిగానే వాదించుకుంటున్నారు. ఫేక్ కలెక్షన్స్ అంటూ గోల చేస్తున్నారు. ముఖ్యంగా.. పవన్ ఫ్యాన్స్ చెప్పే మాట ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఖుషిని సింహాద్రి బ్రేక్ చేయలేకపోయిందని అంటున్నారు. అయినా ఓవరాల్‌గా చూస్తే.. సింహాద్రినే టాప్ ప్లేస్ అని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా కొత్త సినిమాల విషయంలో లేని ఈ లెక్కల గొడవ.. రీ రిలీజ్ విషయంలో ఎందుకు? అనేది ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలకే తెలియాలి.
