యువ చిత్ర పతాకంపై అత్యద్భుతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటు. చక్రపాణి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, పాలగుమ్మి పద్మరాజు వంటి సాహితీ ప్రముఖులతో ఉన్న అనుబంధమే మురారికి కథాబలం ఉన్న చిత్రాల నిర్మాతగా ఖ్యాతిని సంపాదించి పెట్టింది. చిన్నతనం నుండి సంగీతం, సాహిత్యం మీద ఉన్న మక్కువే ఆయన నిర్మించిన చిత్రాలు కలకాలం ప్రేక్షకుల మదిలో నిలిచి ఉండటానికి కారణమైంది. సినిమా రంగం మీద మక్కువ… ఎంబీబీయస్ విద్యను చివరి సంవత్సరంలో ఆపేసి ఆయన్ని చెన్నపట్నం చేర్చింది. మురారి జీవితాన్ని తరచి చూస్తే ఆసక్తికరమైన అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఆయనలోని ముక్కుసూటి తనం, నిర్మొహమాటం చిత్రసీమలో ఎన్నో ఇబ్బందులు పడేలానూ చేసింది. అందుకే ఆయన తన ఆత్మకథను రాసుకుంటూ దానికి ‘నవ్విపోదురు గాక…’ అని నామకరణం చేశారు.
Read Also: Katragadda Murari : టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
1944 జూన్ 14న విజయవాడ మొగల్రాజపురంలో కాట్రగడ్డ భవానీశంకరరావు, అనసూయమ్మ దంపతులకు మురాని జన్మించారు. బిషప్ హజరయ్య స్కూల్లో ప్రాథమిక విద్య, బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హైస్కూల్ లో యస్.యస్.ఎల్.సి. ని అభ్యసించారు. విజయవాడ లయోలా కాలేజీలో పీయుసీ పూర్తి చేశారు. ఆ తర్వాత వరంగల్, హైదరాబాద్ లో వైద్య విద్యను అభ్యసిస్తూ సినిమా రంగంలోకి వెళ్ళిపోయారు. యుక్త వయసులోనే విశేషంగా సాహిత్యాన్ని చదివిన మురారి తన మనసులోని భావాలను, సినిమాలకు సంబంధించిన సమీక్షలను పత్రికలకు పంపుతుండేవారు. అప్పట్లో ఆయన ‘వినీల’ అనే కలంపేరుతో ఆంధ్రజ్యోతి పత్రికకు వ్యాసాలు రాశారు. ఆ తర్వాత తన పినతండ్రి నవయుగ అధిపతి అయిన కాట్రగడ్డ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో వి. మధుసూదనరావు దగ్గర 1969లో ‘మనుషులు మారాలి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో సహాయకునిగా చేరారు. ఆ తర్వాత ”పవిత్రబంధం, మంచివాడు, అత్తా ఒకింటి కోడలు” చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత ‘గంగ-మంగ’ చిత్రానికి చక్రపాణి చెంత చేరారు. ఆ రకంగా వి. మధుసూదనరావు, ఆదుర్తి, కె. బాలచందర్, సేతుమాధవన్, బాపు దగ్గర మూడు సంవత్సరాలు, చక్రపాణి దగ్గర మూడు సంవత్సరాలు దర్శకత్వ శాఖలో పనిచేశారు.
చక్రపాణి దగ్గర పనిచేసిన అభిమానంతో ఆయన నిర్వహించిన ‘యువ’ మాసపత్రిక పేరునే తర్వాతి రోజులలో తన బ్యానర్ కు పెట్టుకున్నారు మురారి. 1978లో యువ చిత్ర పతాకంపై ఆయన తొలి చిత్రంగా ‘సీతామాలక్ష్మి’ని నిర్మించారు. ఆ తర్వాత వరుసగా ”గోరింటాకు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామకళ్యాణం, శ్రీనివాస కళ్యాణం, జానకి రాముడు, నారీ నారీ నడుమ మురారి” చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలన్నింటికీ తానే స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. అలానే వ్యక్తిగత అభిరుచి కారణంగా సంగీత, సాహిత్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన సంస్థకు దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి, సీతారామశాస్త్రి వంటి ఉద్దండులు సాహిత్యాన్ని అందించారు. విశేషం ఏమంటే ‘యువచిత్ర మురారి సినిమా పాటల సాహిత్యం – విశ్లేషణ’పై శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కంపెల్ల రవిచంద్రన్ ఎంఫిల్ సమర్పించారు. మరో విశేషం ఏమంటే… యువ చిత్ర పతాకంపై సినిమాలను ప్రముఖ దర్శకులు తెరకెక్కించారు. కానీ ఆ సినిమాలకు సంగీత దర్శకుడు మాత్రం మారలేదు. అన్ని సినిమాలకూ కె.వి. మహదేవనే స్వరాలు సమకూర్చారు. యువ చిత్ర పతాకంపైనే కాకుండా విజయ బాపినీడు భాగస్వామ్యంలో జ్యోతిచిత్ర పతాకంపై మురారి జేగంటలు సినిమా నిర్మించారు.
తాళ్లూరి రామేశ్వరి, వక్కలంక పద్మ, గౌతమి, రచయిత సత్యమూర్తి, కళాదర్శకుడు రాజు లను మురారి తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణానంతరం ఆయన మీద ఉన్న అభిమానంతో మురారి 11 సినీ గీతాలతో ‘ఇది మల్లెల వేళ’ పేరుతో ఎల్.పి. రికార్డ్ ను హెచ్ఎంవి సంస్థ ద్వారా విడుదల చేయించారు. అలానే ఆచార్య ఆత్రేయ సమగ్ర సాహిత్యం పాఠకుల ముందుకు రావడానికీ మురారి ఎంతో కృషి చేశారు.
‘తెలుగు చలన చిత్ర నిర్మాత చరిత్ర’ పుస్తకానికి మురారి సంపాదకులుగా వ్యవహరించి 75 సంవత్సరాల కాలంలో తెలుగు సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాతల వివరాలను గ్రంథస్థం చేయడానికి తీవ్రకృషి చేశారు. సహాయ దర్శకుడిగా, నిర్మాతగా, సినిమా రంగానికి చెందిన వివిధ సంస్థలలో పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు మురారి. ఆయన నిర్మించిన చిత్రాలు చేతి వేళ్ళ మీద లెక్కపెట్టేవే అయినా… తెలుగు సినిమా రంగంలో ఆ చిత్రాలు ఓ ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్నిపొందాయి. వాటి కారణంగా మురారి చిరంజీవి!