Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!

Emmy Awards 2026 300kb

Emmy Awards 2026 300kb

Emmy Awards 2026: టెలివిజన్, డిజిటల్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పురస్కారాలుగా ఎమ్మీ అవార్డులు (Emmy Awards)నే చెప్పుకుంటారు. సినిమాలకు ‘ఆస్కార్’ ఎలాంటిదో, టెలివిజన్ రంగానికి ఈ అవార్డులు అలాంటి గుర్తింపును ఇస్తాయి. టెలివిజన్ అకాడమీ ఆధ్వర్యంలో అందించే ఈ అవార్డులను ప్రధానంగా టీవీ సిరీస్‌లు, డ్రామాలు, కామెడీ షోలు, రియాలిటీ ప్రోగ్రామ్‌లతో పాటు వాటిలో నటించిన ఉత్తమ నటీనటులు, దర్శకులు, రచయితలకు అవార్డులు ప్రధానం చేస్తారు. వీటితో పాటు సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సౌండ్ ఎడిటింగ్, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లోనూ సత్కారాలు జరుగుతాయి. ఈ ఏడాది 78వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డుల (78th Primetime Emmy Awards) కార్యక్రమం అమెరికా కాలమానం ప్రకారం 2026 సెప్టెంబర్ 14న లాస్ ఏంజిల్స్‌లోని పీకాక్ థియేటర్‌లో ఘనంగా జరగనుంది.

ప్రముఖ హాలీవుడ్ నటి మరిస్కా హర్గిటే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను ఇండియాలో సెప్టెంబర్ 15న తెల్లవారుజామున 4:30 గంటల నుండి జియోహాట్‌స్టార్ (JioHotstar) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా లైవ్ లో చూడవచ్చు. తెల్లవారుజామున ప్రసారం కావడంతో చాలామంది ప్రేక్షకులు లైవ్‌ను మిస్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి వారి కోసం ఈ కార్యక్రమాన్ని వీడియో ఆన్ డిమాండ్ రూపంలో కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. అంటే లైవ్ ప్రసారాన్ని చూడలేకపోయిన వారు తర్వాత తమకు అనుకూలమైన సమయంలో అవార్డ్స్ వేడుకను చూసే అవకాశం ఉంటుంది. దీంతో భారతీయ అభిమానులు కూడా అమెరికన్ టెలివిజన్‌లో అత్యంత కీలకమైన అవార్డ్స్ నైట్‌ను మిస్ కాకుండా ఫాలో అవ్వొచ్చు.

ఈ ఏడాది ఎమ్మీ అవార్డ్స్‌లో అత్యధిక నామినేషన్లతో నిలిచింది ‘ది పిట్’. హెచ్‌బీఓకు చెందిన ఈ మెడికల్ డ్రామాకు ఏకంగా 25 నామినేషన్లు దక్కాయి. దీంతో 2026 ఎమ్మీ అవార్డ్స్‌లో ఈ సిరీస్ ప్రధాన పోటీదారుగా మారింది. ‘ది పిట్’ తర్వాత 24 నామినేషన్లతో ‘హాక్స్’ నిలిచింది. కామెడీ సిరీస్‌గా ఈ షో ఎమ్మీ చరిత్రలోనే ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఒక కామెడీ సిరీస్‌కు అత్యధిక నామినేషన్లు రావడంతో ‘హాక్స్’ ఇప్పటికే వార్తల్లో నిలిచింది. ఇక ఈ ఏడాది నామినేషన్లలో ‘DTF సెయింట్ లూయిస్’ 17 నామినేషన్లతో బలమైన స్థానంలో ఉంది. ‘ది బేర్’, ‘ఆల్ హర్ ఫాల్ట్’కు చెరో 15 నామినేషన్లు వచ్చాయి. ‘ది గిల్డెడ్ ఏజ్’ 13 నామినేషన్లతో తదుపరి స్థానంలో ఉండగా, ‘అబాట్ ఎలిమెంటరీ’, ‘ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్’ చెరో 10 నామినేషన్లను అందుకున్నాయి. ‘యూఫోరియా’ తొమ్మిది నామినేషన్లతో ఈ జాబితాలో ఉంది.

ఈ నామినేషన్లను చూస్తే 78వ ఎమ్మీ అవార్డ్స్‌లో డ్రామా, కామెడీ, మెడికల్ సిరీస్‌లతో పాటు విభిన్నమైన కథలు చెప్పిన షోల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా అత్యధిక నామినేషన్లు అందుకున్న ‘ది పిట్’, ‘హాక్స్’పై అవార్డుల రాత్రి ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 14న అమెరికాలో జరగనున్న ఈ వేడుక భారతీయ ప్రేక్షకులకు మాత్రం సెప్టెంబర్ 15 తెల్లవారుజామున ప్రారంభం కానుంది. ఉదయం 4:30 గంటలకు జియోహాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఉండటంతో టెలివిజన్ సిరీస్‌ల అభిమానులు ముందుగానే అలారం పెట్టుకోవాల్సిందే. లైవ్ మిస్ అయిన వారికి వీడియో ఆన్ డిమాండ్ సదుపాయం ఉండటం మరో సౌకర్యం. మరి ఈసారి ఎమ్మీ అవార్డ్స్‌లో ఎవరు విజేతలుగా నిలుస్తారు, అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న షోలు తమ ఆధిపత్యాన్ని ట్రోఫీలుగా మార్చుకుంటాయా అనేది వేచి చూడాలి.