Site icon NTV Telugu

కంగనా రనౌత్ కు ఏక్తా కపూర్ కితాబు!


ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ జయలలిత బయోపిక్ ‘తలైవి’ తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ విడుదలైంది. మంగళవారం రాత్రి ఆ చిత్రాన్ని చూసిన బాలీవుడ్ నిర్మాత, సీనియర్ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ‘తలైవి’ చిత్ర యూనిట్ ను పొగడ్తలతో ముంచెత్తింది. విజయ్ దర్శకత్వ ప్రతిభతో పాటు అరవింద్ స్వామి, రాజ్ అర్జున్, మధుబాల తమ పాత్రలను అద్భుతంగా పోషించారని చెప్పింది. తెరపై తనకు కంగనా రనౌత్ కాకుండా జయలలిత మాత్రమే కనిపించిందని, ఆ పాత్రను కంగనా అత్యద్భుతంగా పోషించిందని ఏక్తా కపూర్ అభిప్రాయపడింది. ఈ యేడాది తప్పని సరిగా చూడాల్సిన సినిమాలలో ‘తలైవి’ కూడా ఒకటి అని తెలిపింది. కంగనా వంటి నటి తనకు పరిచయం కావడం ఆనందంగా ఉందంటూ ఏక్తా పేర్కొనడం విశేషం. ఇన్ స్టాగ్రామ్ లో ఏక్తా పెట్టిన ఈ పోస్ట్ కు కంగనా రనౌత్ ‘ధ్యాంక్యూ బాస్’ అంటూ బదులిచ్చింది. ఇటీవల హిందీ చిత్రసీమ నుండి రకరకాల ప్రతికూలతలను ఎదుర్కొంటున్న కంగనా రనౌత్ కు ఏక్తా కురిపించిన ప్రశంసల వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించి ఉండొచ్చు.

Exit mobile version