Site icon NTV Telugu

GG Krishna Rao: అయ్యో… టాలీవుడ్ కు ఏమైంది!? సీనియర్ ఎడిటర్ కన్నుమూత!

Gg Editor

Gg Editor

కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్నుమూసిన తర్వాత ఆయన చిత్రాలకు పనిచేసిన ప్రముఖులూ ఒక్కరొక్కరుగా సెలవు తీసుకుంటున్నారు. మొన్న ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న వాణీ జయరాం… ఇవాళ విశ్వనాథ్‌ సినిమాలకే మూడు నంది అవార్డులు అందుకున్న ఎడిటర్ జి.జి. కృష్ణారావు దివికేగారు. దాదాపు రెండు వందలకు పైగా చిత్రాలకు కూర్పరిగా పనిచేసిన కృష్ణారావు మంగళవారం ఉదయం బెంగళూరులో కన్నుమూశారు.

Read Also: K.Vishwanath: విశ్వనాథ్ ‘ఎస్’ సెంటిమెంట్!

గుడివాడ ఎ.ఎన్.ఆర్. కాలేజీలో ఎమ్మెసీ చేసిన జి.జి. కృష్ణారావు ఆ తర్వాత మిలటరీలో చేరాలని అనుకున్నారు. కానీ విధి ఆయన్ని పూనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ వైపు నడిపింది. అక్కడ 1961-62లో ఎడిటింగ్ కోర్సు చేస్తున్న సమయంలో ప్రముఖ దర్శకులు, ఎడిటర్ ఆదుర్తి సుబ్బారావుగారి దృష్టిలో పడ్డారు. ఆయన కృష్ణారావును చెన్నయ్ తీసుకెళ్ళిపోయారు. ప్రాక్టికల్స్ ను చెన్నయ్ లో చేయించిన ఆదుర్తి తాను హిందీలో తీసిన ‘దాగుడు మూతలు’ రీమేక్ ”జ్వార్ భాటా’తో కృష్ణారావును ఎడిటర్ చేశారు. అదే ఆయనకు కూర్పరిగా మొదటి సినిమా. తెలుగులో ‘పాడవోయి భారతీయుడా’తో ఎడిటర్ అయ్యారు కృష్ణారావు.

Read Also: K Vishwanath : సంగీతసాహిత్యాలతోనే విశ్వనాథుని తపస్సు!

కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’కూ జీజీ కృష్ణారావే ఎడిటర్. అయితే అప్పట్లో బెస్ట్ ఎడిటర్ కేటగిరిలో నంది అవార్డు లేదు. దాంతో ఆయనకు రాలేదు. కానీ… 1981లో కె. విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘సప్తపది’కి బెస్ట్ ఎడిటర్ గా అవార్డ్ అందుకున్నారు. అప్పటి నుండే ఎడిటర్ కూ నంది అవార్డ్ ఇవ్వడం మొదలైంది. ఆ తర్వాత కూడా విశ్వనాథ్ రూపొందించిన ‘సాగరసంగమం, శుభసంకల్పం’ చిత్రాలకు కృష్ణారావు ఎడిటర్ పని నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. విశ్వనాథ్ రూపొందించిన ‘సీతామాలక్ష్మి, శుభలేఖ, స్వాతిముత్యం, సూత్రధారులు, సిరివెన్నెల, శుభసంకల్పం, స్వరాభిషేకం’ చిత్రాలకూ ఆయనే పని చేశారు. ఎన్టీయార్ తో దాసరి తీసిన ‘సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి’కి కృష్ణారావే ఎడిటర్. బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’కు ఎడిటర్ ఈయనే. జంద్యాల తొలి చిత్రం ‘ముద్దమందారం’కు జీజీ కృష్ణారావు కూర్పరి. అలానే ‘నాలుగు స్థంభాలాట’కూ వర్క్ చేశారు. కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Exit mobile version