‘బాలు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను పోషించిన మాస్టర్ అభినవ్ మణికంఠ యాభైకు పైగా చిత్రాలలో బాల నటుడి పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఏడేనిమిదేళ్ళు పనిచేసిన దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వంలో గుజ్జా యుగంధర్ రావు నిర్మిస్తున్న సినిమాతో అభినమ్ మణికంఠ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి ‘ఏడ తానున్నాడో’ అనే పేరు పెట్టారు. ప్రియురాలి కోసం ప్రియుడు వెతికే ప్రేమకథలు మనకు చాలానే వచ్చాయి. కానీ దానికి భిన్నంగా ఇందులో ప్రియురాలే ప్రియుడిని వెతుక్కుంటూ రోడ్డెక్కుతుంది. రోడ్ ట్రిప్ బేస్డ్ ఎమోషనల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన ‘ఏడ తానున్నాడో’ మూవీ షూటింగ్ ను వికారాబాద్ ఫారెస్ట్, శ్రీశైలం ఫారెస్ట్, బెంగళూర్, మైసూర్, కూర్గ్ హిట్ స్టేషన్స్ లో తీశారు.
‘ఏడ తానున్నాడో’ మూవీ గురించి దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, ”తాను ప్రేమించిన ప్రియుడి కోసం, అతని జ్ఞాపకాల దారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించే భగ్న ప్రేయసి కథ ఇది. అడ్వెంచర్ థ్రిల్లర్ సంఘటనలతో ఎన్నో మలుపులు తిరుగుతుంది. చివరకు వాళ్లు కలిసారా? లేదా? అనేది మాత్రం వెండితెరపైన చూడాల్సిందే. భగ్న ప్రేయసిగా కోమలి ప్రసాద్ నటన సినిమా కే హైలైట్ గా నిలుస్తుంది. అలానే సంజయ్ స్వరూప్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు” అని చెప్పారు. శివాజీ రాజా, సుదర్శన్, జబర్దస్త్ ఫణి, లావణ్య రెడ్డి, సాత్విక్, కావేరి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ రాయడం విశేషం.
