Site icon NTV Telugu

Dussehra Fight: చిరూ.. ఈ సారి ఏమవుతుంది!?

Nag

Nag

Dussehra Fight:టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆ నలుగురే గుర్తుకు వస్తారు. ఆ తరువాతే నవతరం కథానాయకులను లెక్కిస్తారు. అంతలా అలరించారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. యంగ్ హీరోస్ కు కూడా పోటీ ఇస్తూ సాగుతున్న స్టార్స్ ఎవరంటే చిరంజీవి, బాలకృష్ణ అనే చెప్పాలి. అప్పుడప్పుడూ నాగ్, వెంకీ కూడా మెరుపులు మెరిపిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ సారి దసరాకు చిరంజీవి, నాగార్జున మధ్య పోటీ నెలకొనడం చర్చనీయాంశమయింది. ఎందుకంటే ఈ నలుగురు టాప్ స్టార్స్ లో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చిరంజీవి, నాగార్జునే అని సినీజనమే కాదు సామాన్య జనం కూడా చెబుతారు. అలాంటి చిరు, నాగ్ మధ్యే బాక్సాఫీస్ వార్ కు తెరలేవడం నిజంగా విశేషమే! నిజానికి వీరిద్దరి మధ్య పోటీయే ఉండదని అందరూ అనుకున్నారు. కానీ, వీరిద్దరి సినిమాలు ఒకే రోజున జనం ముందుకు వస్తూ ఉండడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

నిజానికి టాప్ స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ పండగ సందర్భాల్లోనే సాగుతూ ఉంటుంది. చిరంజీవి కూడా ఇతర టాప్ స్టార్స్ తో పండగ సందర్భాల్లోనే పోటీపడ్డారు. ఆయన సినిమాతో తొలిసారి బాక్సాఫీస్ బరిలో ఒకే రోజున దూకిన స్టార్ హీరో ఎవరంటే వెంకటేశ్! 1988లో చిరంజీవి ‘మంచిదొంగ’, వెంకటేశ్ ‘రక్తతిలకం’ రెండు సినిమాలు జనవరి 14న సంక్రాంతి సంబరాల్లో పోటీ పడ్డాయి. ఆ పోటీలో రెండు సినిమాలు జనాన్ని అలరించినా, చిరంజీవిదే పైచేయిగా సాగింది. ఆ తరువాత 2001 జనవరి 11న మళ్ళీ సంక్రాంతి సంబరాల్లోనే చిరంజీవి, మరో మాస్ హీరో బాలకృష్ణతో పోటీ అనివార్యమయింది. ఆ రోజున విడుదలైన చిరంజీవి ‘మృగరాజు’ కంటే బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఒకే రోజున చిరంజీవి మరో స్టార్ హీరో నాగార్జునతో ఢీ కొంటున్నారు. ఈ సారి దసరా పండగకు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ద ఘోస్ట్’ బాక్సాఫీస్ వార్ లో పోటీకి సై అంటున్నాయి. మరి ఈ సారి ఎవరు బాక్సులు బద్దలు చేస్తారో చూడాలి.

Exit mobile version