Nani New Movie: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వరుస తెలుగు సినిమాలతో టాలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన ‘ఐ యామ్ గేమ్’ ఆశించిన స్థాయిలో స్పందన అందుకోకపోవడంతో ఇప్పుడు ఆయన ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ సదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 2026లో బహుభాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో దుల్కర్ మరో క్రేజీ తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా హీరో నాని నిర్మాణంలో కావడంతో ఈ కాంబినేషన్‌పై అప్పుడే సినీ వర్గాలలో చర్చ మొదలైంది.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించే ఒక కొత్త సినిమాకి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించడానికి చర్చలు జరుపుతున్నారు. ఇటీవల కొచ్చిలో జరిగిన ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్ల ప్రెస్ మీట్‌లో నాని ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై హింట్ ఇచ్చారు. నాని తన స్వంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ హీరోగా ఈ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి యువ దర్శకుడు రామ్ జగదీష్ కథను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ డ్రాఫ్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే దుల్కర్‌కు పూర్తి కథా వినే కార్యక్రమం ఉంటుందని నాని స్పష్టం చేశారు. దుల్కర్‌కు ఈ కథ నచ్చితే వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.
ప్రస్తుతం నాని నిర్మాణ సంస్థలో పలు భారీ ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ జానకి’ కూడా ఈ బ్యానర్‌లోనే తెరకెక్కుతోంది. మరోవైపు ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ను కూడా నాని నిర్మిస్తున్నారు. ఇక దుల్కర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ‘ఆకాశంలో ఒక తార’ కీలకంగా మారింది. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు డ్రామా బహుభాషల్లో నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా మరోసారి బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని దుల్కర్ అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నాని నిర్మాణంలో దుల్కర్ సినిమా నిజంగా కార్యరూపం దాల్చితే మాత్రం టాలీవుడ్‌లో ఇది క్రేజీ కాంబినేషన్‌గా మారే అవకాశం ఉంది.
ఇక నాని, దుల్కర్ సల్మాన్ ల మధ్య మంచి ఆఫ్-స్క్రీన్ స్నేహ బంధం ఉంది. అందుకే నాని హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్‌కు చెందిన ‘వేఫెరెర్ ఫిల్మ్స్’ సంస్థ గ్రాండ్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎలాంటి వాయిదాలు లేకుండా 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

