Crime Thriller OTT : ఒక సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు సంవత్సరాల పాటు ఎదురుచూడడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఫ్రాంచైజీల్లో ‘దృశ్యం’ ముందు వరుసలో ఉంటుంది. సస్పెన్స్ తో సాగే స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్ అత్యుత్తమ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ఒకటిగా నిలిచింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘దృశ్యం 3’ థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టడంతో థ్రిల్లర్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన తొలి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి. ఆతరువాత తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా భారీ విజయాలను అందుకున్నాయి. కుటుంబ కథతో పాటు ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే ఈ సినిమాలను క్లాసిక్ థ్రిల్లర్లుగా నిలబెట్టింది.
ఈ విజయాల తర్వాత రూపొందిన ‘దృశ్యం 3’ను కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్ 66వ పుట్టినరోజు సందర్భంగా మే 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అయితే తొలి రెండు భాగాలతో పోలిస్తే ఈసారి ప్రేక్షకుల నుంచి స్పందన తగ్గినట్లే కనిపించింది. కథలో సస్పెన్స్ ఉన్నప్పటికీ, గత చిత్రాల స్థాయిలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆకట్టుకోలేకపోయాయి. తెలుగులో ఇప్పటికే వెంకటేష్ హీరోగా ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ రీమేక్‌లు విజయవంతమయ్యాయి. అయితే మూడో భాగాన్ని మాత్రం రీమేక్ చేయకుండా ఒరిజినల్ మలయాళ వెర్షన్‌ను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినా, తమిళనాడులో మాత్రం ఈ సినిమా అద్భుతమైన వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అక్కడ సుమారు రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు (జూన్ 18) నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమా అందుబాటులో ఉంది. థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న ఫేమ్ ను దృష్టిలో ఉంచుకుంటే ఓటీటీలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

