University Movie: గత నాలుగు దశాబ్దాలుగా స్నేహచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో సినిమాలను రూపొందిస్తున్నారు ఆర్. నారాయణమూర్తి. ఇంతవరకూ 29 చిత్రాలను తెరకెక్కించిన ఆయన తాజాగా ‘యూనివర్సిటీ’ పేరుతో మరో సినిమాను తీశారు. దీని లోగో ఆవిష్కరణ సోమవారం ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, హాస్య బ్రహ్మ, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ బ్రహ్మానందం ఈ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తొలుత నారాయణమూర్తి మాట్లాడుతూ, ”నా బ్యానర్ నుండి వస్తున్న 30వ చిత్రమిది. ‘యూనివర్సిటీ’ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తీసిన సినిమా. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అక్కడ నాకు మంత్రి బొత్స సత్య నారాయణ గారితో పాటు పలువురు సహకారం అందించారు. వైజాగ్ సత్యానంద్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్య, వైద్యం ఈ రెండూ సేవా రంగాలు అని రాజ్యాంగం చెపుతోంది. అందుకు అనుగుణంగా ఈ రెండు రంగాలు ప్రవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించేలా ఉండాలి. విద్యార్థులు జాతి సంపద. వారిని కుల మత భేదం లేకుండా ప్రోత్సహించాలి. విద్య ఇప్పుడు ప్రైవేట్ పరం అయిపోతుంది. భారత దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో తీశాను. ప్రధాని నరేంద్రమోడీ గారు సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేయకుండా మీరిచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని అన్నారు.
లోగో ఆవిష్కరణ అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ, ”నారాయణమూర్తి 35 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పటికి అలానే వున్నాడు. స్నేహాచిత్ర పిక్చర్స్ బ్యానర్ పెట్టి ఎన్నో అద్భుత మైన సినిమాలు తీశారు. ఎప్పుడూ సినిమానే ఆయనకు ప్రాణం. కళాత్మక చిత్రాల దర్శకులు, వ్యాపారాత్మక చిత్రాల దర్శకులు మనకు చాలామంది ఉన్నారు. కానీ ప్రజా దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ఒక్కడే. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే… ఆ సముద్రమే చూసే వ్యక్తి ఆర్. నారాయణ మూర్తి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన. తాజాగా ఆయన ఎడ్యుయేషన్ సిస్టమ్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ‘యూనివర్సిటీ’ లోగో ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. విద్య బ్యాక్ డ్రాప్ లో యూనివర్సిటీ సినిమా తీశారు. అప్పటిలో ఉన్న చదువు ఇప్పుడు లేదు. ఇవాళ చదువు కొనే రోజులొచ్చాయి. కొన్ని యూనివర్సిటీలు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. ఎడ్యుకేషన్ మాఫియాను కూడా నారాయణమూర్తి ఇందులో చూపించారు. ఈ విద్యావ్యవస్థలోని లోపాలు అందరూ తెలుసుకుని మసులు కోవాలి. అందుకోసం ఈ సినిమా చూడండి” అని అన్నారు.
