(ఏప్రిల్ 9న ‘డాక్టర్ – సినీయాక్టర్’కు 40 ఏళ్ళు)
తాను అభిమానించే వారినే ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు. ఓ దశకు వచ్చాక వారితోనే పోటీపడాలనీ ఆశిస్తారు. ఎందుకంటే, తన ఆదర్శమూర్తితో తాను సరితూగాలని ప్రతి అభిమానికీ అభిలాష ఉంటుంది. అలాంటి కోరికతోనే హీరో కృష్ణ చిత్రసీమలో అడుగు పెట్టారు. చిన్నతనంలో తాను ఎంతగానో అభిమానించిన మహానటుడు యన్టీఆర్ తో కలసి నటించారాయన. ఆ సంతోషం చాలక, రామారావు సినిమాలు విడుదలయ్యే సమయంలోనే తన చిత్రాలనూ రిలీజ్ చేసి ఆనందించారు. యన్టీఆర్ వంటి టాప్ స్టార్ మూవీస్ తో పాటే తన సినిమాలు వస్తేనే, జనాల్లో తన పేరూ నానుతూ ఉంటుందని ఆయన భావించారు. అలాగే చేశారు. అందరూ యన్టీఆర్ తో కృష్ణకు పోటీ ఏంటని అన్నారు. కొందరు మరో రకంగానూ రామారావు దగ్గర మోశారు. అయితే కృష్ణ తన అసలైన అభిమాని అని యన్టీఆర్ తెలుసుకున్నారు. అసలే ఆయన భోళా మనిషి, “ఓకే … గోహెడ్ బ్రదర్…” అన్నారు. అలా అనడమే కాదు కృష్ణ హీరోగా రూపొందుతోన్న ‘డాక్టర్-సినీయాక్టర్’ మూవీలో ఓ సీన్ లో ‘బొబ్బిలిపులి’ గెటప్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు రామారావు. అప్పటికే యన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని నెలకొల్పి, ప్రచార పర్వంలో పయనిస్తున్నారు. ఆ సమయంలో ‘బొబ్బిలి పులి’ విడుదలకు ముందే, ఆ గెటప్ తెరపై కనిపిస్తుందని తెలిస్తే అభిమానుల మది ఎలా ఊగిపోతుందో వేరే చెప్పాలా? వారి లాగే యన్టీఆర్ అభిమాని అయిన కృష్ణ మనసు కూడా ఆనందంతో గెంతులు వేసింది. యన్టీఆర్ ‘బొబ్బిలిపులి’ గెటప్ తొలిసారి తెరపై కనిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందిన ‘డాక్టర్-సినీయాక్టర్’. ఈ చిత్రం 1982 ఏప్రిల్ 9న విడుదలయింది. విజయనిర్మల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యన్టీఆర్ ‘బొబ్బిలిపులి’గా తెరపై చూపడంతో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ చూసింది.
‘డాక్టర్ – సినీయాక్టర్’ కథ విషయానికి వస్తే ఓ డాక్టర్ భార్య లేకపోయినా కొడుకు మధుతో జీవిస్తూ ఉంటాడు. అతని చెల్లెలి చనిపోవడంతో ఆమె కొడుకు రాజును కూడా తీసుకు వచ్చి పెంచుతుంటాడు. తనలాగే ఇద్దరూ డాక్టర్లు కావాలని అతని కోరిక. కానీ, కొడుకు మధు తండ్రిలాగే బాగా చదువుకుంటాడు. మేనల్లుడు రాజు మాత్రం యాక్టర్ కావాలని చిన్నతనం నుంచే కలలు కంటూ ఉంటాడు. మధు తండ్రి కోరుకున్న విధంగానే డాక్టర్ అవుతాడు. రాజు నాటకాల పిచ్చిలో పడి ఫెయిల్ అవుతాడు. దాంతో రాజు, మధు మధ్య విభేదాలు వస్తాయి. తాను ఏ నాటికైనా యాక్టర్ అవుతానని రాజు మద్రాసు బయలుదేరుతాడు. అవకాశం దొరికి, అతను తన ప్రతిభను నిరూపించుకుంటాడు. చివరకు టాప్ హీరో అవుతాడు. మధు తన తండ్రి ఫ్రెండ్ కూతురును పెళ్ళాడుతాడు. రాజు, తన మరదలును పెళ్ళి చేసుకుంటాడు. తరువాత కొందరు సినీజనం రాజును చంపాలని చూస్తారు. రాజు చనిపోయాడని అతని భార్యతో పాటు అందరూ భావిస్తారు. కానీ, మధు వెళ్ళి, సినిమా డైరెక్టర్ ను మాటల్లో పెట్టి అసలు విషయం కూపీ లాగుతాడు. తానే హత్య చేయించానని సినిమా డైరెక్టర్ చెప్పడంతో అతనికి దేహశుద్ధి చేసి చట్టానికి అప్పగిస్తారు. రాజు బ్రతికాడని తెలిశాక అందరూ ఆనందిస్తారు. అతని భార్య కోలుకుంటుంది. అభిమానులకు మరింత ఆనందం కలుగుతుంది. రాజుకు ఫ్యాన్స్ జేజేలు పలుకుతూ ఉండగా కథ ముగుస్తుంది.
ఇందులో కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. జయసుధ, కవిత నాయికలు. సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నరసింహరాజు, రవికాంత్, సిహెచ్. కృష్ణమూర్తి, సుభాషిణి, మమత, సూర్యకాంతం, పుష్పకుమారి, కాకినాడ శ్యామల నటించారు. కాంతారావు, గీత, నగేశ్, సారథి, మాడా, జగ్గారావు అతిథి పాత్రల్లో కనిపించారు. పినిశెట్టి రాసిన కథకు ఆచార్య ఆత్రేయ మాటలు పలికించారు. వేటూరి, అప్పలాచార్య పాటలు రాశారు. కొండవీటి వేంకటకవి రాసిన సంభాషణలో ఓ సీన్ లో కృష్ణ శివాజీ పాత్రలో కనిపిస్తారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. కొల్లూరి శ్రీరామచంద్ర మూర్తి, కె.ఎల్. నరసింహులు నిర్మాతలు.
యన్టీఆర్ కు సన్నిహితుడైన తోట సుబ్బారావు సమర్పణలో నరనారాయణ కంబైన్స్ పతాకంపై ‘డాక్టర్-సినీయాక్టర్’ రూపొందింది. ఇందులో ‘బొబ్బిలిపులి’ గెటప్ లోనే కాదు, యన్టీఆర్ తాను కృష్ణతో కలసి నటించిన ‘వయ్యారి భామలు-వగలమారి భర్తలు’ షూటింగ్ లోనూ కనిపిస్తారు. మొత్తానికి ‘డాక్టర్-సినీయాక్టర్’ అభిమానులను అలరించింది. ఓపెనింగ్స్ భలేగా రాబట్టింది.
