Site icon NTV Telugu

Jyothi Lakshmi: జ్యోతిలక్ష్మి డ్యాన్సరే కాదు.. హీరోయిన్ కూడా.. ఎన్ని సినిమాల్లో చేసిందో తెలుసా?

Jyothilakshmi News

Jyothilakshmi News

Jyothi Lakshmi acted in Films as Heroine: 1970వ దశకంలో నృత్య కళాకారిణిగా చలనచిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి, తన అందచందాలతో ఆనాటి కుర్రకారు మతిపోగొట్టిన నటి జ్యోతిలక్ష్మి. వ్యాంప్ పాత్రలకు పెట్టింది పేరు జ్యోతిలక్ష్మి. ఎన్టీ రామారావు, కృష్ణ వంటి సూపర్ స్టార్లు చిత్రసీమను రాజ్యమేలుతున్న రోజుల్లో జ్యోతిలక్ష్మి లేదా జయమాలినితో ఓ పాట లేని సినిమాలు చాలా అరుదుగా వచ్చేవి. ముఖ్యంగా 1980వ దశకంలో ఆమె పాట ఒక్కటి ఉంటే చాలు, సినిమా సూపర్ హిట్టు అనే ధోరణి కనిపించేది. జ్యోతిలక్ష్మి వయ్యారాలు, నడుము తిప్పుతూ చేసే నృత్యాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయేవారు. దాదాపు 300 చిత్రాల్లో ఆమె నటిస్తే, అందులో 250 వరకూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయంటే, ఆమె హవా ఎలా నడిచిందో చెప్పుకోవచ్చు. ఎనిమిదేళ్ల ప్రాయంలో శివాజీ గణేశన్ నటించిన ‘కార్తవరాయన్’ చిత్రంలో నృత్యం చేసి తెరపై కాలు పెట్టిన జ్యోతిలక్ష్మి, 1967లో వచ్చిన ‘పెద్దక్కయ్య’ చిత్రంలో తెలుగు చిత్ర సీమకు పరిచయమై. 1973లో శోభన్ బాబు హీరోగా నటించిన ‘ఇదాలోకం’ చిత్రంలో ‘గుడి ఎనకా నా సామి గుర్రమెక్కి కూకున్నాడు’ అంటూ వచ్చిన పాటతో ఆమె అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.

Miral Telugu: మే 17న తెలుగులో హారర్ థ్రిల్లర్ ‘మిరల్’

సొంత సోదరి జయమాలిని, సిల్క్ స్మిత వంటి నవతరం డ్యాన్సర్లు తెరపైకి వచ్చిన తరువాత, జ్యోతిలక్ష్మికి అవకాశాలు తగ్గిపోగా, కెమెరామెన్ సాయి ప్రసాద్ ను వివాహం చేసుకుని చిత్రసీమకు దూరమయ్యారు. అయితే దక్షిణాదిని ఒక ఊపు ఊపిన జ్యోతిలక్ష్మి మీకు నృత్య తారగానూ, వ్యాంప్ గానే తెలుసు. కానీ ‘పాయల్ కే ఝంకార్’ అనే హిందీ సినిమాలో కిషోర్ కుమార్ పక్కన చేశారామె. తమిళంలో కూడా 10 సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. MGR తో ‘తలైవన్’ లో వాణి శ్రీ తో పాటు హీరోయిన్ గా ఆమె కూడా చేశారు. శివాజీ గణేశన్ తో సెకండ్ హీరోయిన్ గా నటించారు. కృష్ణతో ‘హంతకులు – దేవాంతకులు, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త’, హరనాధ్ తో ‘పుణ్యవతి’, రామకృష్ణతో ‘పిల్లా పిడుగా?’ సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. ఈవిడ స్పెషాలిటీ ఏమిటంటే – తన కాస్ట్యూమ్స్ కి తానే డిజైనర్. తానే స్కెచ్ వేసుకుని తన టైలర్ తోనే కాస్ట్యూమ్స్ కుట్టించుకునేవారట. ఇక ఆమె పేరుతోనే ‘జ్యోతిలక్ష్మి’ అనే సినిమా కూడా వచ్చింది. ‘జ్యోతిలక్ష్మి చీర కట్టింది – చీరకే సిగ్గేసింది’ అనే పాట కూడా ఉన్న సంగతి తెలిసిందే కదా!

Exit mobile version