లాక్ డౌన్ తర్వాత వినోదరంగ ప్రాధాన్యమే మారిపోయింది. థియేటర్లు మూత పడటంతో గత కొంత కాలంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ లే ప్రధానమైన వినోద వనరులుగా మారాయి. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లకు ఆదరణ పెరిగి చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల ఓ సర్వే ప్రకారం ఇండియాలో డిస్నీ+ హాట్‌స్టార్ అత్యధిక సభ్యుల సభ్యత్వం పొందిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది. సినిమాలు, వెబ్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్ వంటి యాక్టివిటీతో ఈ ప్లాట్ ఫామ్ పట్ల యూజర్స్ ఎక్కువ ఆకర్షితులవుతున్నారట. ప్రస్తుతం భారతదేశంలో 2.5 కోట్లకు పైగా సభ్యులను హాట్ స్టార్ కలిగి ఉన్నట్లు లెక్కలుచెబుతున్నాయి.
ఇక అమెజాన్ ప్రైమ్ 1.7 కోట్ల మందితో రెండవ స్థానంలో ఉందట. 70 లక్షల మంది సభ్యులతో సోనీ లివ్ మూడో స్థానం దక్కించుకుందట. గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు మాత్రం మనదేశంలో కేవలం 46 లక్షల చందాదారులే ఉన్నట్లు సమాచారం. 40 లక్షల సభ్యులతో జీ 5 ఐదవ స్థానంలో ఉంది. 17 నెలల క్రితం ఆరంభం అయిన తెలుగు ఓటీటీ ఛానెల్ ‘ఆహా’ 15 లక్షల సబ్ స్క్రైబర్స్ ని సంపాదించుకుంది. ఇక సబ్‌స్క్రిప్షన్ రేటు ఎక్కువ వల్ల ఆదాయం విషయంలో నెట్ ప్లిక్స్ హాట్‌స్టార్‌ని బీట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే రోజురోజుకు ఓటీటీ పట్ల ఆకర్షితులవుతూ చందాదారుల సంఖ్య పెరుగుతున్న కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్గా కొత్త కంటెంట్ ఇవ్వటానికి పోటీ పడుతున్నాయి. దీంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ యూజర్స్ విషయంలో అంకెలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉండటం విశేషం.
