‘విక్రమ్’ అనగానే కమల్ హాసన్ నటించి, నిర్మిస్తున్న ‘విక్రమ్’ చిత్రమని అపోహ పడే ఆస్కారం లేకపోలేదు! కానీ ఇది మరో ‘విక్రమ్’ గురించిన సంగతి. గత యేడాది డిసెంబర్ 31న విడుదలైన ‘విక్రమ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు హరిచందన్. నాగవర్మ, దివ్యారావు జంటగా నటించిన ఈ సినిమా తమిళంలోనూ ‘మహావీరన్’ పేరుతో విడుదలైంది. శుక్రవారం హరిచందన్ పుట్టినరోజు కావడంతో తన సినీ ప్రయాణం గురించి హరిచందన్ వివరించారు. ‘చిన్నతనం నుండి సినిమాలంటే ఉన్న ఆసక్తితో ఏడేళ్ళ క్రితం చెన్నై వెళ్ళి ఫిల్మ్ జర్నీ ప్రారంభించాన’ని అన్నారు. ఈ ప్రయాణంలో దర్శకులు తేజ, బాబీ, సంగీత దర్శకులు కోటి, గీత రచయిత చంద్రబోస్ ఎంతో సహకరించారని తెలిపారు.
తన తొలి చిత్రం ‘విక్రమ్’ను త్వరలో ఓటీటీలో కూడా విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. అలానే ‘విక్రమ్’ కంటే ముందే మొదలు పెట్టిన ‘మిస్టర్ ప్రాజెక్ట్ హెచ్’ మూవీ క్లయిమాక్స్ మినహా పూర్తయ్యిందని, ఈ యాక్షన్ డ్రామాలో ఆశిష్, వినోద్, పార్వతీ కీలక పాత్రలు పోషించినట్టు తెలిపారు. దీన్ని వేసవి కాలంలో విడుదల చేస్తామని, అలానే శ్రీసాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ ప్రముఖ హీరోయిన్ కీలక పాత్రలో రవీంద్ర కె నిర్మాతగా ఓ సినిమా త్వరలో మొదలు కాబోతోందని చెప్పారు.
