Krishna Vrinda Vihari: నాగశౌర్య ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు. ఓ ప్రొడక్షన్ హౌస్ అధినేత కూడా. ఐరా క్రియేషన్స్ అనేది అతని సొంత నిర్మాణ సంస్థ. నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ముల్పూరి దాని ప్రెజెంటర్ కాగా, తల్లి ఉషా ముల్పూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ ఈ బ్యానర్ లో ‘ఛలో, నర్తనశాల, అశ్వద్థామ’ చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని అనీశ్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. హిలేరియస్ ఎంటర్ టైనర్‌గా ‘కృష్ణ వ్రింద విహారి’ తెరకెక్కిందనే విషయం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
‘కృష్ణ వ్రింద విహరీ’ మూవీ నాగశౌర్య హోమ్ బ్యానర్‌లో నిర్మితం కావడంతో దీని ప్రమోషన్స్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు ఈ హ్యాండ్ సమ్ హీరో. మన వాళ్ళు సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం పరిపాటి. అలానే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ ను తీసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోని కాలేజీలనూ చుట్టి వస్తుంటారు. కానీ ఇప్పుడు నాగశౌర్య ‘అంతకు మించి’ అంటున్నాడు. అదేమిటంటే.. ‘కృష్ణ వ్రింద విహారి’ని ప్రమోట్ చేయడానికి నాగశౌర్య ఏకంగా పాదయాత్ర చేయబోతున్నాడట.
అయితే.. రెండు తెలుగు రాష్ట్రాలను నాగశౌర్య కాలినడకన చుట్టేస్తాడేమో అని అనుకోకండి. ఈ చిత్రం బృందం తిరుపతి నుండి వైజాగ్ వరకూ టూర్ చేయాలని భావిస్తోంది. ఒక ఊరికి మరో ఊరికి మధ్య కారులో ప్రయాణిస్తూ, ఎంపిక చేసిన సిటీకి చేరగానే.. అక్కడ నుండి వెన్యూ వరకూ నాగశౌర్య కాలినడకన వెళతాడట. దారిలో సాధారణ ప్రజలతో పాటు తన మూవీ లవర్స్ తోనూ ఇంటరాక్ట్ అవుతాడట. ఈ వ్యవహారాన్ని చూస్తుంటే.. మీకు గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్.. తాజాగా ఇటు షర్మిల, అటు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలు గుర్తుకు రాకమానవు. రాజకీయ నేతల పాదయాత్రలంటే ఓకే కానీ నాగశౌర్య లాంటి యంగ్ హీరో రోడ్డు మీద నడవడం మొదలెడితే రచ్చరచ్చ కావడం ఖాయం. దానికి తగ్గట్టుగా చుట్టూ తగినంత మంది బౌనర్స్ ను పెట్టుకునే, తన జాగ్రత్తలో తాను ఈ పాదయాత్ర చేస్తాడని తెలుస్తోంది. ఏదేమైనా.. ఇవాళ సినిమాను జనానికి చేరువ చేయడానికి, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడానికి మనవాళ్ళు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నారు. మరి నాగశౌర్య చేస్తున్న పాదయాత్రను రాబోయే రోజుల్లో ఇంకెంతమంది హీరోలు అనుసరిస్తారో చూడాలి.