స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన నట వారసుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తన కంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ధృవ్ నటించిన కొత్త చిత్రం ‘బైసన్’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.
Also Read : Mouli Tanuj : ‘లిటిల్ హార్ట్స్’ హిట్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుండి..మౌళికి బిగ్ ఆఫర్!
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రతిభావంతుడైన దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను రా, రస్టిక్, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించారు. ఇందులో ధృవ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, మరో ముఖ్య పాత్రలో రజీషా విజయన్ కనిపించనుంది. అక్టోబర్ 24న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు ముందుగా అక్టోబర్ 13 రాత్రి 9 గంటలకు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు గ్రామీణ వాతావరణం, కబడ్డీ క్రీడా, రాజకీయ డ్రామా, కుటుంబ ఎమోషన్స్, హత్యలు వంటి విభిన్న అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సీన్‌లో బర్రె పుర్రె చూపించడంతో ప్రారంభమై, చివర్లో అదే పుర్రెను హీరో తండ్రి నీటిలో పడేయడం వంటి షాట్స్ సినిమాకు ఇంటెన్స్ టచ్ ఇచ్చాయి.
ట్రైలర్‌లో ధృవ్ మాస్ లుక్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, కబడ్డీ ప్లేయర్‌గా అతను పడే కష్టం అద్భుతంగా చూపించారు. అనుపమ పరమేశ్వరన్‌తో లవ్ ట్రాక్, తండ్రి చెప్పే ‘కబడ్డీ వద్దు’ అనే భావోద్వేగ క్షణాలు ప్రేక్షకులను కదిలించేలా ఉన్నాయి. చివర్లో చేయికి గాయంతో ఉన్న ధృవ్ పుషప్స్ చేసే సీన్ హైలైట్‌గా నిలిచింది. బీజీఎమ్ అద్భుతంగా ఉండటంతో పాటు సినిమాకు రా ఇంటెన్సిటీ ని మరింత పెంచింది. మొత్తం ట్రైలర్ 1990 దశకంలోని సామాజిక, రాజకీయ పరిస్థితుల చుట్టూ సాగే కథనాన్ని సూచిస్తోంది. డైరెక్టర్ పా రంజిత్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధృవ్, అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్లతో పాటు లాల్, పశుపతి, హరి కృష్ణన్, అళగమ్ పెరుమాల్, కళైయారసన్, అరువి మదానంద్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ధృవ్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది అత్యంత గంభీరమైన పాత్రగా చెప్పవచ్చు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ “విక్రమ్ వారసుడు నిజంగానే సత్తా చాటాడు” అని కామెంట్స్ చేస్తున్నారు.
