Site icon NTV Telugu

Dhanush Birthday Special : విలక్షణమే ధనుష్ కు సలక్షణం!

Dhanush

Dhanush

Dhanush Birthday Special:
తెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. అలాంటి తెలివైన నటుడు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ధనుష్. అదే ఆయనను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమనటునిగా నిలచిన ధనుష్, రాబోయే చిత్రాల్లోనూ విలక్షణమైన పాత్రలతో సాగే ప్రయత్నంలో ఉన్నారు.

ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు కస్తూరి రాజా. 1983 జూలై 28న మద్రాసులో జన్మించారు ధనుష్. తమిళ దర్శకనిర్మాత, సంగీత దర్శకుడు అయిన కస్తూరి రాజా చిన్నకొడుకు ధనుష్. పీలగా కనిపించే ధనుష్ లో మంచి నటుడు ఉన్నాడని గుర్తించింది కస్తూరి రాజాయే. ఇక ఆయన పెద్దకొడుకు సెల్వరాఘవన్ రచయిత, దర్శకుడు. ధనుష్ తొలి చిత్రం ‘తుల్లువదో ఇలమై’ చిత్రానికి అన్న సెల్వరాఘవన్ కథ సమకూర్చగా, తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించారు. తరువాత వచ్చిన “పొల్లాదవన్, యారాడీ నీ మోహిని” చిత్రాలు ధనుష్ కు మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆ తరువాత నుంచీ గాయకునిగా, గీతరచయితగా, నిర్మాతగా కూడా ధనుష్ తన ప్రతిభను చాటుకుంటూ సాగారు.

ధనుష్‌ నటించిన హిందీ చిత్రం ‘రాంఝనా’ కూడా ఆయనలోని నటుణ్ణి ఉత్తరాది వారికి పరిచయం చేసింది. తరువాత అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ స్టార్ తో నటిస్తూ ధనుష్ ‘షమితాబ్’లో తనదైన బాణీ పలికించారు. ఇక ధనుష్ నటించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి. ‘రఘువరన్ బి.టెక్.’తో ధనుష్ తెలుగువారికి మరింత దగ్గరయ్యారు. ‘ఆడుకాలం’ చిత్రంతో తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన ధనుష్, మూడేళ్ళ కిందట వచ్చిన ‘అసురన్’తో మరో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. కిందటేడు వచ్చిన ధనుష్ చిత్రం ‘జగమే తంత్రం’ అంతగా ఆకట్టుకోలేక పోయింది. అక్షయ్ కుమార్ తో ధనుష్ నటించిన హిందీ చిత్రం ‘అత్రంగీ రే’ అంతగా అలరించలేక పోయింది. ‘మారన్’ సైతం పెద్దగా మురిపించలేదు. ధనుష్ నటించిన ఇంగ్లిష్ మూవీ ‘ద గ్రే మేన్’ ఈ నెల 15న థియేటర్లలోనూ, 22న నెట్ ఫ్లిక్స్ లోనూ వెలుగు చూసింది. ధనుష్ హీరోగా రూపొందిన ‘తిరుచిత్రాంబలమ్’ ఆగస్టు 18న విడుదల కానుంది. ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘నానే వరువాన్’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోన్న ‘సార్’, ‘వాతి’ కూడా తుదిమెరుగుల్లో ఉన్నాయి. ఈ చిత్రాలన్నిటా ధనుష్ విలక్షణ పాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమాలు ధనుష్ కు ఏ స్థాయిలో సంతృప్తిని అందిస్తాయో చూడాలి.

Exit mobile version