Dhanush Bilingual Movie SIR Teaser Released: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. మేకర్స్ ప్రకటించినట్టుగానే.. తమిళ హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా ‘సార్’ టీజర్‌ను గురువారం (జులై28) సాయంత్రం విడుదల చేశారు. ‘జీరో ఫీజ్, జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్, మోర్ ఎడ్యుకేషన్’ అంటూ మొదలయ్యే ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇందులో పలు గెటప్స్‌లో కనిపించిన ధనుష్.. ఎప్పట్లాగే ఎనర్జిటిక్‌గా చెలరేగిపోయాడు. జూనియర్ లెక్చరర్ బాలగంగాధర్ తిలక్‌గా నటిస్తున్న ధనుష్.. విద్యావ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్న వారిపై ఎలా పోరాటం కొనసాగించాడన్న ఇతివృత్తంతోనే ఈ సినిమా తెరకెక్కుతోందని టీజర్ చూస్తే స్పష్టతమవుతుంది.
ఈ టీజర్‌లో తెలుగులో ధనుష్ చెప్పిన డైలాగ్.. తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం ఖాయం. ‘విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్.. పంచండి, ఫైవ్ స్టార్ హోటల్‌లో డిష్‌లాగా అమ్మకండి’ అనే డైలాగ్‌ను అక్షర దోషాలు లేకుండా, చాలా చక్కగా డైలాగ్ చెప్పాడు. దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుత సమాజానికి తగినట్టు ఒక మంచి సబ్జెక్ట్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. విద్యని వ్యాపారంగా చేసుకుంటున్న కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఈ చిత్రం చెంపపెట్టులాంటిదే! కాగా.. ధనుష్ తెలుగులో చేస్తోన్న తొలి తెలుగు సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
