Devara 2 Update : సోషల్ మీడియాలో ఒక్క పోస్టు చాలు. అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించడానికి. ఇప్పుడు అలాంటి చర్చే జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య జోరుగా సాగుతోంది. కారణం ఒక సరదా సోషల్ మీడియా సంభాషణ. అయితే ఆ సరదా కామెంట్ల వెనుక మాత్రం ‘దేవర 2’పై అభిమానుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.
తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్టు అందరి దృష్టిని ఆకర్షించింది. ‘వేర్ ఈజ్ దేవర? వాట్ హ్యాపెండ్ టు వరా?’ అంటూ ఆమె చేసిన కామెంట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటకు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె చేసిన ఈ సరదా ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. అయితే ఆయన నేరుగా సమాధానం ఇవ్వకుండా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మీమ్‌ను ఉపయోగిస్తూ రిప్లై ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ మీమ్‌లో వినిపించే ‘అడ్రెస్ పెట్టు’ అనే డైలాగ్ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తింది. కొద్ది నిమిషాల్లోనే ఆ పోస్టు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. అభిమానులు వేల సంఖ్యలో కామెంట్లు చేస్తూ, ‘దేవర 2’ ఎప్పుడు వస్తుంది అంటూ ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు. సరదాగా మొదలైన ఈ సంభాషణ చివరికి సినిమా సీక్వెల్ చర్చకు దారి తీసింది.
Hey @tarak9999 sir👋
Where is Devara, What happened to Vara…?#Devara2 https://t.co/yzEyOLReCy— Jahnavi Kapoor (@JanhvikapoorFC_) June 5, 2026
ఇదే సమయంలో ‘దేవర 2’పై గత కొంతకాలంగా వినిపిస్తున్న పుకార్లు కూడా మళ్లీ చర్చకు వచ్చాయి. దర్శకుడు కొరటాల శివ, నందమూరి బాలకృష్ణతో కొత్త సినిమాను ప్రకటించిన తర్వాత ‘దేవర’ సీక్వెల్ నిలిచిపోయిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది. కొందరు అయితే ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయిందని కూడా ప్రచారం చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ప్రచారాల్లో నిజం లేదనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘దేవర 2’ కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలుస్తోంది. కొరటాల శివ పూర్తి స్క్రిప్ట్‌ను ఎన్టీఆర్‌కు వినిపించగా, కథపై ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటమే ఆలస్యానికి కారణమని చెబుతున్నారు. ప్రాజెక్ట్ మాత్రం నిలిచిపోలేదని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సోషల్ మీడియాలో జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘దేవర’ గర్జన మరోసారి బాక్సాఫీస్‌ను కుదిపేస్తుందా అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే అభిమానులు ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే.

