మంచు విష్ణుకి వ్యతిరేకంగా యూట్యూబ్ చానెళ్లలో ఉన్న వీడియోలు, కంటెంట్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తి ప్రతిష్ట దిగజార్చేలా ఉన్న కంటెంట్‌ను వెంటనే తొలిగించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆయన స్వరం, ఆయన పేరు, ఆయన తీసిన సినిమాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించారు. ఈ మేరకు పది యూట్యూబ్ లింక్‌లకు హైకోర్టు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ తీర్పు సోషల్ మీడియాలో నటులు, వారి కుటుంబాల పై అవమానకరమైన సమాచారాన్ని అరికట్టేందుకు విష్ణు మంచు చేపట్టిన విస్తృత ప్రయత్నాలను బలపరుస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా, విష్ణు మంచు అనైతిక యూట్యూబ్ ఛానళ్ళ పై అవమానకరమైన సమాచారాన్ని పోస్ట్ చేసే వారి పై చర్యలు తీసుకోవడంలో ముందడుగు వేశారు. ఇప్పటివరకు ఆయన చర్యల ద్వారా 75 అవమానకరమైన యూట్యూబ్ లింకులు తొలగించబడ్డాయి. ఇది సెలబ్రిటీలకు ఒక సురక్షితమైన వాతావరణం కల్పించడం కోసం ముందడుగు పడినట్లు అయింది.
Balakrishna: బాక్సులు బద్దలయ్యే న్యూస్.. ఇక రచ్చ రచ్చే!
అవమానకరమైన విషయాలు, ఏ పద్ధతిలో నైనా ప్రచురణ లేదా ప్రచారం చేయకుండా కోర్టు తీర్పునిచ్చింది. విష్ణు మంచు పేరు, స్వరం, చిత్రము, లేదా ఏ ఇతర ప్రత్యేక లక్షణాలను వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనం కోసం అనధికారికంగా వినియోగించకూడదని తెలిపింది. విష్ణు మంచు వ్యక్తిత్వ/ప్రచారం హక్కులను అపహరించడం, దుర్వినియోగం చేయడం వంటివి చేయకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అవమానకరమైన సమాచారాన్ని కలిగిన లింకులని నిలిపివేయాలని ఐటీ, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. నిందితులు 48 గంటలలోపు అన్ని ఉల్లంఘనల విషయాలను తొలగించవలసి ఉంటుంది, లేకపోతే యూట్యూబ్ ఈ విషయాలను నిరోధించి/నిలిపివేయవలసి ఉంటుందని కోర్టు తెలిపింది. కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం ప్రముఖ వ్యక్తుల డిజిటల్ హక్కులను రక్షించడంలో ఒక కీలక ముందడుగు అని ప్రఖ్యాత న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ అభివర్ణించారు. ఈ ముఖ్యమైన ఆదేశంతో, కళాకారుల గౌరవాన్ని రక్షించాలనే విష్ణు మంచు సంకల్పానికి మరింత బలం చేకూరినట్టు అయింది.