NTV Telugu Site icon

Dakota Fanning: అడవిలో డకోటా ఫ్యానింగ్ ఏం చేయబోతోంది!?

Dacota

Dacota

భారతీయ మూలాలున్న హాలీవుడ్ డైరెక్టర్ మనోజ్ నైట్ శ్యామలన్ తనదైన బాణీ పలికించారు. ఆయన కూతురు ఇషానా నైట్ శ్యామలన్ తండ్రి అడుగుజాడల్లోనే మెగాఫోన్ పట్టి ‘ద వాచర్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇంతకుముందు తండ్రి రూపొందించిన “ఓల్డ్, నాక్ ఎట్ ద క్యాబిన్” సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన ఇషానా ‘ద వాచర్స్’తో తన సత్తా చాటుకోవాలని చూస్తోంది. ఇందులో డకోటా ఫ్యానింగ్ ప్రధాన పాత్ర పోషించడం ఇప్పుడు విశేషంగా మారింది. తండ్రి సినిమాల్లోని థ్రిల్ నే తానూ అందించాలని ఆశిస్తోంది ఇషానా. ‘ద వాచర్స్’లో 28 ఏళ్ళ మినా అనే పాత్రలో డకోటా ఫ్యానింగ్ నటిస్తోంది. వెస్ట్రన్ ఐర్లాండ్ లోని ఓ దట్టమైన అడవిలో మినా చిక్కుకుంటుంది. అక్కడ ఆమెకు ముగ్గురు అపరిచితులు కనిపిస్తారు. వారు తమను ఎవరో చూస్తున్నారని చెబుతుంటారు. మినాకు కూడా కొన్ని వింతజీవులు వారిని పరికించి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తరువాత ఆ అడవి నుండి ఆమె ఎలా బయటపడింది- అన్న అంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

‘ద వాచర్స్’లోని మినా పాత్ర తనకు ఓ ఛాలెంజింగ్ అని డకోటా ఫ్యానింగ్ చెబుతోంది. ఫ్యానింగ్ నటించిన తాజా చిత్రం ‘ఈక్విలైజర్ 3’ ఈ యేడాదే విడుదల కానుంది. కాగా ‘ద వాచర్స్’ సినిమా 2024 జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తాను ‘ద వాచర్స్’లోని మినా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నానని డకోటా అంటోంది. మరి ఈ సినిమాతో ఫ్యానింగ్ నటిగా ఎలాంటి మార్కులు అందుకుంటుందో కానీ, ‘ద వాచర్స్’ దర్శకురాలిగా ఇషానాకు మాత్రం పరీక్షనే! తొలి చిత్రంతోనే ఇషానా తన కంటే ఎక్కువ మార్కులు పోగేస్తుందని తండ్రి మనోజ్ శ్యామలన్ అంటున్నారు. ఏమవుతుందో చూడాలంటే వచ్చే యేడాది దాకా ఆగాల్సిందే!

Show comments