NTV Telugu Site icon

D. V. Narasa Raju :డి.వి.నరసరాజు మాటల గారడి!

Dv Narsa Raju Jayanthi

Dv Narsa Raju Jayanthi

డి.వి.నరసరాజును చూడగానే చాలా గంభీరమైన వ్యక్తి అనిపిస్తారు. కొందరికి ముక్కోపిలా కనిపిస్తారు. ఆయన మాటకారి కాదు కానీ, ఆయన రచనలో జాలువారిన మాటలు తెలుగువారిని విశేషంగా మురిపించాయి.
‘గుండమ్మ’ను “గుండక్కా…” అని పిలిపించినదీ, ‘యమగోల’లో “తాళము వేసితిని గొల్లెము మరచితిని…” అని పలికించినదీ, “పిచ్చోడిలాగా ఏమిటి… ఖచ్చితమైన పిచ్చోడినైతే…” అంటూ శంకరం నోట ‘పెద్దమనుషులు’పై వ్యంగ్యం చిలికించినదీ నరసరాజే!

దాట్ల వెంకట నరసరాజు 1920 జూలై 15న జన్మించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం తాల్లూరు నరసరాజు స్వస్థలం. చదువుకొనే రోజుల నుంచీ ప్రతీ అంశాన్నీ నిశితంగా పరిశీలించేవారు. అదే ఆయనలో హేతువాదాన్ని నెలకొల్పింది. ప్రఖ్యాత హేతువాది ఎమ్.ఎన్.రాయ్ ప్రభావం నరసరాజుపై ఉండేది. హిందూ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, మద్రాసు లయోలా కాలేజ్ లో బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు. అప్పటి నుంచీ నాటకాలు రాస్తూనే ఉండేవారు. “ఈ ఇల్లు అమ్మబడును, వాపసు” అనే నాటకాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అప్పుడే కేవీ రెడ్డి దృష్టిలో పడ్డారు- ‘పెద్దమనుషులు’ చిత్రకథనంలో కేవీరెడ్డితో కలసి పాలు పంచుకున్నారు. సంభాషణలు పలికించారు. నటీనటుల మాట కన్నా, వారి హావభావాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా నరసరాజు రచనలు సాగేవి. అంటే తన స్క్రిప్ట్ లో కేవలం సంభాషణలే కాకుండా, పాత్రల హావభావాలను సైతం చక్కగా పొందుపరిచేవారు. ‘పెద్దమనుషులు’లో ఓపెనింగ్ సీన్ లోనే పెద్దలు ఉపన్యాసాలు ఇచ్చే సన్నివేశాన్ని చూస్తే, అందులో పాత్రలు ప్రవర్తించే తీరులోనే నవ్వులు పూస్తాయి. అన్నపూర్ణ వారి తొలి చిత్రం ‘దొంగరాముడు’లోనూ పూటకూళ్లమ్మ ఇంటి వద్ద పొడుపుకథలతో నరసరాజు సాగించిన సంభాషణం ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. షేక్స్ఫియర్ ‘హామ్లెట్’ను బి.యన్.రెడ్డి “రాజమకుటం”గా మలచినప్పుడూ నరసరాజు తనదైన శైలిలో మాటలు రాసి అలరించారు. అందులో కథానాయకుడు ప్రతాపసింహుడు పిచ్చివాడిగా నటించే సమయంలో వల్లించిన మాటలు భలేగా ఆకట్టుకుంటాయి. ఇక ‘గుండమ్మ కథ’లో పలు సన్నివేశాలలో నరసరాజు బాణీ అలరిస్తుంది. ఆయన రాసిన ‘రాముడు-భీముడు’ కథను విజయాధినేతలు, తరువాత మరికొందరు నిర్మాతలు సినిమాకు పనికిరాదన్నారు. అదే కథను డి.రామానాయుడు తన తొలి చిత్రంగా తీసి విజయం సాధించారు. ఆ తరువాత అదే కథ తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయింది. మొదట్లో ఆ కథను వద్దనుకున్న నాగిరెడ్డి, చక్రపాణి తమిళ, హిందీ చిత్రాలను నిర్మించడం విశేషం. అలా జనాన్ని కట్టిపడేసే కథలూ రాసి మెప్పించారు నరసరాజు. ‘భక్త ప్రహ్లాద’ పౌరాణిక చిత్రంలోనూ నరసరాజు కలం బలం భలేగా పనిచేసింది.

యన్టీఆర్ హీరోగా రూపొందిన “నాదీ ఆడజన్మే, సి.ఐ.డి., తిక్కశంకరయ్య, బడిపంతులు, వాడే-వీడు, మగాడు, యమగోల, కేడీ నంబర్ వన్, యుగంధర్, శృంగార రాముడు, వయ్యారిభామలు- వగలమారి భర్తలు” చిత్రాలకు నరసరాజు మాటలతో మత్తు చల్లి అలరించారు. ముఖ్యంగా ‘యమగోల’ చిత్రానికి నరసరాజు పలికించిన సంభాషణలు ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొన్నాయి. సమకాలీన సమస్యలను, రాజకీయాలనూ ‘యమగోల’లో వ్యంగ్యంగా చిత్రించారు నరసరాజు. ఏయన్నార్ హీరోగా రూపొందిన “మూగనోము, గృహలక్ష్మి, జై జవాన్, ఇద్దరు అమ్మాయిలు, శ్రీరంగనీతులు, రావుగారిల్లు” చిత్రాలకు నరసరాజు రచన చేశారు. యన్టీఆర్ ‘తమ్ముడి పెళ్ళి-మామ భరతం’ అనే స్క్రిప్ట్ ను నరసరాజుతో తయారు చేయించారు. అలాగే ‘పుణ్యదంపతులు’ అనే కథనూ నరసరాజుతో రాయించారు. ఈ ‘పుణ్యదంపతులు’కు పాటలనూ నరసరాజు కలం ద్వారా పలికింపచేశారు. అయితే యన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో ఆ కథలు చిత్రరూపం దాల్చలేదు. తరువాత నరసరాజు, రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన కొన్ని చిత్రాలకు మాటలు రాశారు. ఆ సంస్థ నిర్మించిన ‘కారు దిద్దిన కాపురం’కు దర్శకత్వం వహించారు. ఇక ఇ.వి.వి. సత్యనారాయణ తొలి చిత్రం ‘చెవిలో పువ్వు’లో నరసరాజు హీరోయిన్ సీత తాతగా నటించారు. ‘మనసు-మమత’ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించారు నరసరాజు.

‘ఈనాడు’ దినపత్రికలో నరసరాజు కాలమ్స్ రాసేవారు. వాటిలోనూ చమక్కు చూపించి, పాఠకులకు గిలిగింతలు పెట్టేవారు. విజయాధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి తనయులు చందమామ విజయా కంబైన్స్ పతాకంపై మళ్ళీ చిత్ర నిర్మాణం చేపట్టి, తొలి ప్రయత్నంగా ‘బృందావనం’ తెరకెక్కించారు. ఈ చిత్రానికి నరసరాజు రచన చేశారు. తన ఆత్మకథను చెబుతూ రికార్డ్ చేశారు నరసరాజు. తరువాత ‘అదృష్టవంతుని ఆత్మకథ’గా అది వెలుగుచూసింది. నరసరాజు రాసిన ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో పలువురు తారల సినిమా విశేషాలు చోటు చేసుకున్నాయి. విజయచిత్ర సినిమా పత్రికలో ఆయన రాసిన ‘మొగలి రేకులు’లోని సినిమా విశేషాలు కూడా పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నాటికీ సినిమా పెద్దలు స్క్రిప్ట్ గురించి మాట్లాడుకొనేటప్పుడు నరసరాజు పేరును ప్రస్తావిస్తూ ఉండడం విశేషం!ఎందుకంటే, పాత కథనైనా కొత్తగా చెప్పగలిగేవాడే రచయిత అని నరసరాజు భావన. నేడు ఎంతోమంది దర్శకులు, రచయితలు అదే పంథాలో సాగుతున్నారని వేరే చెప్పాలా!?