Site icon NTV Telugu

Will Smith : ఆస్కార్ ఉత్త‌మ న‌టుడు విల్ స్మిత్ కు ఏం జ‌ర‌గ‌నుంది?

will smith

పెళ్ళాన్ని ఎవ‌రైనా వెకిలిగా కామెంట్ చేస్తే, ఏ మొగుడైనా ఊరుకుంటాడా? అలా ఎవ‌రైనా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉంటే మ‌న వాళ్ళు వాడిని కొజ్జా అనకుండా ఉండ‌లేరు. మ‌న భార‌తీయుల్లాగే కాసింత బ్రౌన్ గా, మ‌రింత బ్లాక్ గా క‌నిపించే వెస్టిండీస్ సంత‌తికి చెందిన వారు ఊర‌కే ఉంటారా? 94వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో అదే జ‌రిగింది. ఈ సారి ఉత్త‌మ న‌టునిగా నిల‌చిన విల్ స్మిత్ త‌న భార్య జెడా పింకెట్ స్మిత్ ను ఆస్కార్ ఉత్స‌వంలో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన క్రిస్ రాక్ కామెంట్ చేయ‌గానే, త‌ట్టుకోలేక పోయాడు. వెళ్ళి క్రిస్ చెంప‌పై ఒక్క‌టిచ్చాడు. ఇప్పుడు దానిని నేరంగానూ, ఘోరంగానూ ప‌రిగ‌ణిస్తున్నారు అకాడ‌మీ స‌భ్యులు. ఇప్ప‌టి దాకా ఇలాంటి హింసాత్మ‌క సంఘ‌ట‌న అకాడ‌మీ అవార్డుల వేదిక‌పై ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని, ఈ విష‌యంలో విల్ స్మిత్ శిక్షార్హుడ‌ని తెల్ల‌వారు వాదిస్తున్నారు. ఈ అవార్డుల ప్ర‌దానోత్స‌వానికి ముందు ఆస్కార్ వేడుక‌ల్లో ఎప్పుడూ న‌ల్ల‌జాతీయుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌నే వాదం ఈ సారి తీవ్రంగా త‌లెత్తింది. 94 సంవ‌త్స‌రాల నుంచీ జ‌రుగుతున్న ఈ ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో మొద‌టి నుంచీ న‌ల్ల‌వారిని అణ‌గ‌దొక్కుతూనే ఉన్నార‌ని ఈ మ‌ధ్య మ‌రింత విశేషంగా వినిపించింది. అయితే ఈ సారి ఉత్త‌మ‌న‌టుల విభాగంలో నామినేష‌న్స్ పొందిన విల్ స్మిత్, డెంజెల్ వాషింగ్ట‌న్ ఇద్ద‌రూ న‌ల్ల‌జాతీయులే. అలాగే ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా గెలుపొందిన అరియానా డిబోస్ కూడా న‌ల్ల‌జాతికి చెందినవారే. ఈ ప్ర‌ధాన అవార్డులు వారికి ల‌భించ‌డం ప‌ట్ల బ్లాక్స్ సంబ‌రాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు విల్ స్మిత్ రాక్ ను కొట్టిన చెంప‌దెబ్బ దుమారం రేపుతోంది.

Read Also : Bruce Willis : న‌ట‌న‌కు దూరంగా డై హార్డ్ స్టార్!

రాక్ ను కొట్టిన త‌రువాత త‌న ఉత్త‌మ‌న‌టుడు అవార్డు తీసుకొనే స‌మ‌యంలో త‌న ప్ర‌వ‌ర్త‌న‌కు సిగ్గు ప‌డుతున్నాన‌ని, క్ష‌మించ‌మ‌ని విల్ స్మిత్ కోరారు. అయితే ఆ స‌మ‌యంలో బాధితుడు రాక్ కు ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్ప‌లేదు. త‌రువాత త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో రాక్ కు క్ష‌మాప‌ణ చెప్పారు స్మిత్. దీనిని కూడా అకాడ‌మీ త‌ప్పు ప‌డుతోంది. విల్ ముందుగానే రాక్ కు క్ష‌మాప‌ణ చెప్పి ఉంటే బాగుండేద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో రాక్ కు విల్ 30 మిలియ‌న్ డాల‌ర్లు దోష ప‌రిహారంగా చెల్లిస్తార‌నీ వినిపిస్తోంది. ఇప్ప‌టి దాకా ఈ విష‌యంపై రాక్ ఏమీ స్సందించ‌లేదు. త‌న‌ను విల్ కొట్టిన స‌మ‌యంలోనే , తాను లిడాను కామెంట్ చేయ‌గానే విల్ కు కోపం వ‌చ్చింద‌ని స‌ర్ది చెప్పుకొని వేడుక‌ను నిర్వ‌హించారు. విష‌య‌మేమిటంటే, రాక్ కూడా న‌ల్ల‌జాతీయుడే కావ‌డం. అందువ‌ల్ల విల్ ప్ర‌వ‌ర్త‌న‌ను సాటి బ్లాక్స్ కూడా త‌ప్పు ప‌డుతున్నారు. ఇంత‌కూ రాక్ , లిడాపై చేసిన కామెంట్ ఏమిటి? ఆమె త‌ల‌గొరుగుడు వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. అందువ‌ల్ల ట్రీట్ మెంట్ లోఉన్న లిడా గుండు గీయించుకోవ‌ల‌సి వ‌చ్చింది. ఇది తెలియ‌ని రాక్, ఆమెను చూసి లిడాను చూస్తే జిఐ జేన్లా క‌నిపిస్తోంద‌ని కామెంట్ చేశాడు రాక్. 1997లో రూపొందిన అమెరికా వార్ మూవీ జి.ఐ.జేన్. ఇందులో క‌థానాయికగా న‌టించిన డెమీ మూర్ పాత్ర కోసం గుండు గీయించుకుని న‌టించారు. అందువ‌ల్ల లిడాను చూసి జి.ఐ.జేన్ గా అభివ‌ర్ణించాడు రాక్. ఆ కామెంట్ ఎప్పుడూ కామ్ గా సంతోషంగా ఉండే విల్ కు కోపం తెప్పించింది.

రాక్ చెంప ప‌గ‌ల‌గొట్టిన త‌రువాత విల్ ను ఆ వేడుక నుండి బ‌య‌ట‌కువెళ్ళ వ‌ల‌సిందిగా నిర్వాహ‌కులు కోరార‌ట‌. అయితే అందుకు విల్ తిర‌స్క‌రించ‌డం కూడా ఇప్పుడు అకాడ‌మీ స‌భ్యులు నేరంగా భావిస్తున్నారు. ఈ విష‌యంలో రాక్ కు జ‌రిగిన అవ‌మానానికి వారు క్ష‌మాప‌ణ చెప్పారు. ప్ర‌స్తుతం విల్ పై ఏలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అన్న అంశంపై చ‌ర్చిస్తున్నారు. విల్ ను కొన్నాళ్ళ పాటు కానీ, శాశ్వ‌తంగా కానీ ఇక‌పై అకాడ‌మీ అవార్డుల వేడుక‌లో బహిష్క‌రించాలి అన్న కోణంలో యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. లేదా విల్ కు ఉత్త‌మ‌న‌టునిగా ప్ర‌దానం చేసిన అవార్డును వెన‌క్కి తీసుకోవాలా అన్న‌దానిపైనా చ‌ర్చ సాగుతోంది. ఈ రెండింటిలో ఏది జ‌రిగినా అమెరికాలోని న‌ల్ల‌జాతీయులు తీవ్రంగా స్పందించే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి!

Exit mobile version