Continental Doctors Pressmeet On Superstar Krishna Death: మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనే సూపర్‌స్టార్ కృష్ణ మృతి చెందారని కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్ గురు ఎన్. రెడ్డి స్పష్టం చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో నిన్న తెల్లవారుజామున కృష్ణ తమ ఆసుపత్రిలో చేరారని, ఆ సమయానికే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే ఎమెర్జెన్సీలో చికిత్స అందించి, ఆ తర్వాత ఐసీయూలో దాఖలు చేశామన్నారు. రెండు, మూడు గంటల్లోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయని.. నాలుగు గంటల తర్వాత డయాలసిస్ చేశామని వెల్లడించారు. తాము గంటకోసారి కృష్ణ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులకు అప్డేట్ ఇస్తూ వచ్చామన్నారు. తాము ఎంత మెరుగైన చికిత్స అందించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయిందని, ఈ విషయంపై తాము నిన్న సాయంత్రమే చర్చించుకున్నామని తెలిపారు.
నిన్న సాయంత్రం 7 గంటలకు కృష్ణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు పేర్కొన్నారు. కృష్ణకు మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని, అందుకే మిగతా అవయవాలు సరిగ్గా పని చేయలేదని వివరించారు. దీంతో చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదన్నారు. చివరి క్షణాల్లో కృష్ణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నామన్నారు. ఉదయం 4:07 గంటలకు కృష్ణ మృతి చెందారని తెలిపారు. తాము ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా, ఒక వ్యక్తి ప్రాణాలతో మిగలడని తమకు తెలిసినప్పుడు.. వైద్య నీతిలో భాగంగా ఇకపై వైద్యం అందించకుండా ప్రశాంతంగా ఉండాలని వదిలేస్తామని, కృష్ణ విషయంలోనూ అదే చేశామని వెల్లడించారు. కృష్ణ ఒక గొప్ప వ్యక్తి అని, ఎప్పుడూ తమ కాంటినెంటల్ ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకునేవారని, ఆయన కుటుంబసభ్యులు కూడా గత 9 ఏళ్లుగా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్నారు. కృష్ణకు సేవలు అందించినందుకు వైద్యులుగా తాము గర్వపడుతున్నామని చెప్పుకొచ్చారు.