Kantharao: చిత్రమేమో కానీ, అనేక చిత్రాలలో నటరత్న యన్టీఆర్, నటప్రపూర్ణ కాంతారావు అన్నదమ్ములుగా నటించి అలరించారు. వారిద్దరూ 1923లోనే కొన్ని నెలల తేడాతో జన్మించారు. యన్టీఆర్ శతజయంతి మే 28న మొదలు కాగా, నవంబర్ 16న కాంతారావు శతజయంతి ప్రారంభమవుతోంది. ఈ నాటికీ కాంతారావును జనం ‘కత్తి’ కాంతారావు అనే అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. నటరత్న తరువాత అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించిన ఘనత కాంతారావు సొంతం. ఇక యన్టీఆర్ తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లోనూ నటించి అలరించారు కాంతారావు. అన్నిటినీ మించి నారద పాత్రలో కాంతారావు అభినయం నభూతో నభవిష్యతిగా సాగింది. తరువాతి రోజుల్లో కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గా నటించారాయన. నిర్మాతగానూ కొన్ని చిత్రాలు నిర్మించారు. సినిమా రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’తో సన్మానించింది.
తాడేపల్లి లక్ష్మీకాంతారావు 1923 నవంబర్ 16న జన్మించారు. ఆంధ్రప్రాంతం నుండి వచ్చి నల్గొండలో స్థిరపడ్డారు కాంతారావు కుటుంబీకులు. కొంతకాలం గుంటూరు జిల్లాలో కాంతారావు చదువు సంధ్యలు సాగాయి. ఆ సమయంలోనే ఆయన మనసు నాటకాలవైపు మళ్ళింది. నాటకాల్లో రాణిస్తున్న తరుణంలో సినిమాల్లో ప్రయత్నించమని మిత్రులు చెప్పడంతో మదరాసు చేరి, ‘టాకీపులి’గా పేరొందిన హెచ్.ఎమ్.రెడ్డిని కలిశారు కాంతారావు. ఆ సమయంలో హెచ్.ఎమ్.రెడ్డి ‘నిర్దోషి’ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అందులో కాంతారావుకు ఓ చిన్న వేషం ఇచ్చారు. తరువాత హెచ్.ఎమ్.రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ప్రతిజ్ఞ’ చిత్రం ద్వారా టి.యల్.కాంతారావును హీరోగా పరిచయం చేశారు. అదే చిత్రంలో రాజనాల విలన్ గా పరిచయం కావడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తరువాత యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘జయసింహ’లో ఆయనకు తమ్ముడు విజయసింహగా కాంతారావు నటించారు. అప్పటి నుంచీ వారిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం కొనసాగింది. చాలా రోజులు యన్టీఆర్ నీడలోనే కాంతారావు నటజీవితం సాగిందని చెప్పాలి.
యన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలలో కాంతారావుకు ప్రముఖ పాత్రలు పోషించే అవకాశం కల్పించారు. ‘లవకుశ’లో లక్ష్మణునిగా కాంతారావును ఎంపిక చేయడంలో యన్టీఆర్ పాత్ర ఎంతో ఉంది. ఆ చిత్రం ద్వారానే కాంతారావుకు ఉత్తమనటునిగా రాష్ట్రపతి బహుమతి లభించింది. ఇక శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లో పేరొందిన యన్టీఆర్, వేరే పాత్రలు పోషించిన పౌరాణిక చిత్రాలలో ఆ పాత్రల్లో కాంతారావు అలరించడం విశేషం! యన్టీఆర్ ‘ఇంద్రజిత్’లో కాంతారావు శ్రీరామునిగా నటించారు. అలాగే యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసము’, ‘ప్రమీలార్జునీయం’ చిత్రాలలో కాంతారావు శ్రీకృష్ణునిగా అభినయించారు. యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ తెరకెక్కించిన ‘సీతారామకళ్యాణం’లో నారదుని పాత్రను కాంతారావుతో ధరింప చేశారు. అయితే యన్టీఆర్ ‘దీపావళి’లోనూ కాంతారావు నారదునిగా నటించగా, ఆ సినిమా ముందు విడుదలయింది. ఆ తరువాత యన్టీఆర్ “శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీసత్యనారాయణ మహాత్మ్యం, శ్రీకృష్ణ పాండవీయము, శ్రీకృష్ణతులాభారము, శ్రీకృష్ణవిజయము, శ్రీకృష్ణ సత్య, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం” చిత్రాలలో కాంతారావు నారద పాత్రలో జీవించారనే చెప్పాలి. ఆయనకంటే ముందు, తరువాత ఎందరు నారద పాత్రల్లో అలరించినా, ఆ పాత్ర పేరు చెప్పగానే కాంతారావే గుర్తుకు వస్తారు.
జానపద చిత్రాలను రూపొందించడంలో తనకు తానే సాటి అనిపించుకున్న బి.విఠలాచార్య దర్శకత్వంలో కాంతారావు నటించిన పలు సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. “జయ-విజయ, కనకదుర్గ పూజా మహిమ, వరలక్ష్మీ వ్రతము, గురువును మించిన శిష్యుడు, జ్వాలాద్వీప రహస్యం, భలే మొనగాడు, ఇద్దరు మొనగాళ్ళు” వంటి విఠలాచార్య చిత్రాలలో కాంతారావు కథానాయకునిగా అలరించారు. ఇవి కాకుండా జి.విశ్వనాథం దర్శకత్వంలో రూపొందిన మరికొన్ని జానపదాల్లోనూ కాంతారావు హీరోగా నటించి ఆకట్టుకున్నారు. యన్టీఆర్ తో కలసి “భట్టి విక్రమార్క, కంచుకోట, చిక్కడు-దొరకడు, ఏకవీర” వంటి జానపదాల్లో కీలక పాత్రల్లో నటించి మురిపించారు కాంతారావు.
తన సీనియర్ హీరోలయిన యన్టీఆర్, ఏయన్నార్ స్ఫూర్తితో కాంతారావు సైతం సొంతగా నిర్మాణ సంస్థ నెలకొల్పి చిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మించిన ‘సప్తస్వరాలు, ప్రేమజీవులు’ పరాజయం పాలయ్యాయి. తరువాత ‘గుండెలు తీసిన మొనగాడు’ చిత్రంలో తానే హీరోగా నటించి, క్రైమ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా ఫరవాలేదనిపించింది. అయితే అంతకు ముందు వచ్చిన నష్టాలు మాత్రం భర్తీ కాలేదు. తరువాత పలు చిత్రాలలో విలన్ గానూ నటించారు. కేరెక్టర్ రోల్స్ కు మారిన తరువాత తన దరికి చేరిన ప్రతి పాత్రలోనూ కనిపించారు. మరో ప్రయత్నం అనుకుంటూ ‘స్వాతిచినుకులు’ అనే చిత్రం నిర్మించారు. అది కూడా పరాజయం పాలయింది. చివరి రోజుల్లో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన జీవితం భావితరాల వారికి గుణపాఠం కావాలని చెప్పేవారు. 2000 సంవత్సరంలో ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2009 మార్చి 22న కాంతారావు కన్నుమూశారు. నేటికీ ఈ నటప్రపూర్ణున్ని అభిమానించేవారు ఉన్నారు. బుల్లితెరపై కాంతారావు కత్తిసాము చేసిన చిత్రాలను ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు.
