City Civil Court Gives Big Shock To Yashoda Team: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘యశోద’ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! మంచి రివ్యూలతో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కొల్లగొడుతోంది. ఆల్రెడీ ఇది బ్రేకీవన్ టార్గెట్‌ని దాటేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇకపోతే.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ‘యశోద’ మేకర్స్ తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈలోపే మేకర్స్‌కి ఊహించని దెబ్బ తగిలింది. ఓటీటీలో ఈ సినిమా విడుదలని నిషేధించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
EVA IVF ఆసుపత్రి యాజమాన్యం ‘యశోద’ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘యశోద’ సినిమాలో తమ ‘ఇవా’ హాస్పిటల్ క్యారెక్టర్‌ను దెబ్బ తీసే విధంగా చిత్రీకరించారని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఆ సినిమాలో చూపించిన EVA పేరు కారణంగా.. ప్రస్తుతం నడుస్తున్న ఇవా ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటోందని యాజమాన్యం వెల్లడించింది. ఈ పిటిషన్‌ని విచారించిన కోర్టు.. ఓటీటీలో యశోద విడుదలపై నిషేధం విధించింది. డిసెంబర్ 19వ తేదీ వరకూ యశోదను ఓటీటీలో విడుదల చేసేందుకు వీలు లేదని ధర్మాసనం ఆదేశించింది. అలాగే.. యశోద ప్రోడక్షన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కు వాయిదా వేసింది. మరి.. ఈ వ్యవహారాన్ని చిత్రబృందం ఎలా ఎదుర్కుంటుందో, సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
