Yash: మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గా్ల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో యశ్ మాట్లాడుతూ.. కియారాతో కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. ‘టాక్సిక్’ షూటింగ్ టైంలో కియారా గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె ఆరోగ్యం, భద్రత విషయంలో తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో కలిసి తాను సెట్‌లో కియారాకు బాడీగార్డ్, బౌన్సర్‌లా మారిపోయానని సరదాగా చెప్పారు. కియారా చాలా ప్రొఫెషనల్ నటి అని ప్రశంసించారు. ‘టాక్సిక్’లో ఆమె పాత్ర శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్నదని, అందుకే తొలుత ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకునే విషయంలో కొంత ఆందోళనకు గురైనట్లు చెప్పారు. సినిమా గురించి తొలిసారి మాట్లాడుతున్నప్పుడు కియారాను ‘రెయిన్ సీక్వెన్స్‌లో ఎప్పుడైనా నటించారా?’ అని అడిగానని, దానికి ఆమె ‘లేదు.. కానీ అది సులభంగానే ఉంటుంది’ అని సమాధానం ఇచ్చిందని యశ్ గుర్తుచేసుకున్నారు.
అయితే షూటింగ్ సమయంలో కియారా గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు యశ్ వెల్లడించారు. గర్భవతిగా ఉన్నప్పటికీ తన పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు కియారా 100 శాతం అంకితభావంతో షూటింగ్‌లో పాల్గొన్నారని ప్రశంసించారు. ఆమె విషయంలో కియారా కంటే తామే ఎక్కువగా ఆందోళన చెందామని, సెట్‌లో ఆమె భద్రత కోసం తాను, గీతూ బౌన్సర్లు, బాడీగార్డుల్లా వ్యవహరించామని తెలిపారు. కియారా చూపించిన ప్రొఫెషనలిజం, అంకితభావం తనను ఎంతో ఆకట్టుకున్నాయని యశ్ అన్నారు. ‘టాక్సిక్’లో ఆమె అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో యశ్, కియారా అద్వానీతో పాటు నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

