Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!

Vintara Saradaga Release Date

Vintara Saradaga Release Date

Vintara Saradaga Release Date: నూతన సంవత్సరానికి వినోదభరితమైన ఆహ్వానం పలికేందుకు యంగ్ హీరో, మ‌హేశ్‌ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సిద్ధమవుతున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘VISA-వింటారా సరదాగా’ ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రేమ, స్నేహం, సరదా, యువత జీవితంలోని అనుభవాల కలయికగా తెరకెక్కింది.

కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లే తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి. అశోక్ గల్లా, గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీ, యూత్‌ఫుల్ కథాంశం, వినోదభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. వింటారా సరదాగా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నాయి. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

వింటారా సరదాగాలో అశోక్ గల్లా, గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 1న విడుదల కానున్న ఈ సినిమా యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.