Site icon NTV Telugu

Vijay Pal Reddy: మూడు ప్రాజెక్టులతో సిద్దమైన బార్బరిక్ నిర్మాత

Vijay Pal Reddy

Vijay Pal Reddy

వినూత్నమైన కథలను ఎంచుకుంటూ, కమర్షియల్ హంగులకు అతీతంగా కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే నిర్మాతలు ఇండస్ట్రీలో కొద్ది మందే ఉంటారు. అలాంటి వారిలో ఒకరే నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల. తన వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌పై ఇప్పటికే ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ వంటి విభిన్న చిత్రాలను అందించి, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మంచి సినిమాలు తీయాలనే తపనతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, ఇప్పుడు మరో మూడు కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన గత రెండు చిత్రాలు వేటికవే భిన్నమైనవి. మహాభారతంలోని బార్బరికుడు అనే పాత్ర స్ఫూర్తితో వచ్చిన ‘త్రిబాణధారి బార్బరిక్’ ఒక సరికొత్త ప్రయోగం. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్, తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచింది. తన మనవరాలిని కాపాడుకోవడానికి ఓ తాత చేసే పోరాటాన్ని ఉత్కంఠభరితంగా చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Also Read:TRIVIKRAM : తినడానికి తిండిలేక సునీల్.. త్రివిక్రమ్ ఏం చేశాడంటే..

ఇక ‘బ్యూటీ’ చిత్రం ద్వారా ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని, ముఖ్యంగా యువతను ఆకట్టుకున్నారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని, ప్రేమకథను హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం, ప్రేక్షకులను ఎంతగానో కదిలించింది. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని కథలను ఎంచుకుంటూ, తన అభిరుచిని చాటుకున్నారు. ఒక సినిమాను నిర్మించి, విడుదల చేయడమే గగనమవుతున్న ఈ రోజుల్లో, విజయ్ పాల్ రెడ్డి వరుసగా రెండు చిత్రాలను విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా, ఇప్పుడు మరో మూడు కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టడం విశేషం. ఈ మూడు చిత్రాలు కూడా మూడు విభిన్నమైన జానర్లలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీటిలో ఒక ప్రముఖ హీరోతో కూడా ఓ సినిమా ఉండటం ఇండస్ట్రీలో ఆసక్తిని రేపుతోంది. విభిన్నమైన కంటెంట్‌తో రానున్న ఈ చిత్రాలను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version