Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!

Jananayagan

Jananayagan

Jana Nayagan: బాధ్యతాయుతమైన ఎన్నికల విధుల్లో ఉండి, పైరసీని ప్రోత్సహించిన ఓ వ్యక్తి ఉదంతం ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతోంది. దళపతి విజయ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జననాయగన్’ (Jana Nayagan) లీకైన వెర్షన్‌ను ఎన్నికల నిఘా కేంద్రంలోనే వీక్షించినందుకు గానూ ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఎన్నికల నిఘా కోసం ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన యువరాజ్ అనే వ్యక్తిని సీసీటీవీ హెడ్‌గా నియమించారు. కీలకమైన సెక్యూరిటీ బాధ్యతల్లో ఉన్న యువరాజ్, తన విధులను పక్కనపెట్టి ఇంకా సెన్సార్ బోర్డు దగ్గరే ఉన్న విజయ్ సినిమా ‘జననాయగన్’ లీకైన క్లిప్పింగ్‌లను వీక్షించాడు. మనోడు ఈ సినిమాను చూడటమే కాకుండా ఏకంగా తాను ‘జననాయగన్’ చూస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతకుముందే తాను ఎన్నికల విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు తన ఐడీ కార్డును కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ పోస్టులు కాస్తా వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఎన్నికల విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడమే కాకుండా, పైరసీని ప్రోత్సహించినందుకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా భావిస్తున్న ‘జననాయగన్’ మే 8న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా క్లిప్పింగ్‌లు లీక్ అవ్వడంపై చిత్ర పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. సినిమా లీక్ బాధ్యుడిని చేస్తూ ‘సదరన్ ఇండియా ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్’ (SIFEA), సినిమా ఎడిటర్ ప్రదీప్ ఇ.రాఘవ్‌పై కొన్నాళ్ల పాటు సస్పెన్షన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్‌కే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో రాదో అనేది. ఇప్పటి వరకు సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.