(మే 8న దర్శకనిర్మాత యస్.డి.లాల్ జయంతి)
యాక్షన్ మూవీస్ తెరకెక్కించడంలో మేటి యస్.డి.లాల్. ఇక హిందీ చిత్రాలను తెలుగు చేయడంలోనూ దిట్టగా నిలిచారు లాల్. పలువురు దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేసిన యస్.డి.లాల్, దర్శకునిగా పేరు సంపాదించిన తరువాత కూడా బి.విఠలాచార్య వద్ద కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఏ రోజునా లాల్ భేషజాలకు తావీయలేదు. ఆయన సోదరుడు యస్.యస్.లాల్ తన కెమెరా పనితనంతో అలరించారు. ఈ ఇద్దరు సోదరులు చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’తో దర్శకుడయ్యారు యస్.డి.లాల్. తరువాత యన్టీఆర్ తో ‘నిండుమనసులు’ చిత్రం రూపొందించారు. అది హిందీ చిత్రం ‘ఫూల్ ఔర్ పత్తర్’ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతకుముందు యన్టీఆర్ నటించిన కొన్ని చిత్రాలకు కో-డైరెక్టర్ గానూ లాల్ పనిచేశారు. ఈ సినిమా తరువాత రామారావుతో లాల్ కు సత్సంబంధం ఏర్పడింది. యన్టీఆర్ తో యస్.డి.లాల్ ‘నేనే మొనగాణ్ణి’ అనే చిత్రం నిర్మించి, దర్శకత్వం వహించారు. డిటెక్టివ్ మూవీగా రూపొందిన ఆ సినిమా తరువాతి రోజుల్లో ఆకట్టుకుంది.
రామారావుతో రజతోత్సవాలు!
హిందీ చిత్రాలను రీమేక్ చేయడంలో సిద్ధహస్తుడు యస్.డి.లాల్ అన్న గురి కుదిరింది రామారావుకు. దాంతో ఏ రీమేక్ వచ్చినా, ముందుగా లాల్ పేరునే ఆయన దర్శకునిగా సూచించేవారు. అలా యన్టీఆర్ హీరోగా నటించిన “భలే మాస్టర్, నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, రాజపుత్ర రహస్యం, లాయర్ విశ్వనాథ్” చిత్రాలకు యస్.డి.లాల్ దర్శకత్వం వహించారు. వీటిలో ఒక్క ‘రాజపుత్ర రహస్యం’ మినహాయిస్తే, అన్నీ హిందీ రీమేక్స్ కావడం విశేషం. ఇందులో “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం” చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. చిరంజీవితో యస్.డి.లాల్ తెరకెక్కించిన ‘నకిలీమనిషి’ కూడా అలరించింది. అయితే యస్.డి.లాల్ పేరు వినగానే ఆయన యన్టీఆర్ తో రూపొందించిన చిత్రాలే ముందుగా గుర్తుకు వస్తాయి.
యస్.డి.లాల్ తనయులు మీర్, జానీలాల్ కూడా చిత్రసీమలోనే సినిమాటోగ్రాఫర్స్ గా రాణించారు. ఆయన తమ్ముడు యస్.యస్.లాల్ తనయుడు కబీర్ లాల్ ‘భైరవద్వీపం, ఆదిత్య 369″ వంటి చిత్రాలకు పనిచేశారు. బాలీవుడ్ లో పేరున్న సినిమాటోగ్రాఫర్ గా రాణిస్తున్నారు కబీర్ లాల్. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’లో జడ్జి పాత్రలో కనిపించారు యస్.డి.లాల్ తనయుడు మీర్.