ప్రియదర్శి, నాగదుర్గ జంటగా వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా చుట్టూ ముసురుకున్న వివాదం టాలీవుడ్లో కాక రేపుతోంది. ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఓ పాటలో.. పెళ్లి వేడుకలో అతిథులకు నేరుగా మద్యం సర్వ్ చేస్తున్న విజువల్స్ పట్ల తెలంగాణ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సంస్కృతిని, వివాహ సంప్రదాయాలను తప్పుగా చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ఘాటుగా స్పందించారు. నెటిజన్ల విమర్శలను తిప్పికొడుతూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
“ఒక సమాజపు సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి. ఆ సమాజపు చరిత్రలో, వారి శ్రమలో, కళల్లో, పోరాటాల్లో వెతకండి” అంటూ వేణు ఉడుగుల ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణను కించపరచడం చాలా సులువని, కానీ దాని అస్తిత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి కనీస సంస్కారం కావాలని ఆయన చురకలు అంటించారు. మన నిజ జీవితాల్ని, మన సంస్కృతిని ఉన్నది ఉన్నట్లుగా తెరమీదకు తెచ్చే ‘ఇడుపు కాయితం’ లాంటి సినిమాలను ముందుగా ఆదరించాలని ఆయన కోరారు. సినిమా రిలీజ్ అయ్యాక అందులో కంటెంట్ నచ్చకపోతే విమర్శించడంలో తప్పులేదని, కానీ కేవలం ఒక పాటలోని విజువల్స్ చూసి ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని అజ్ఞానంతో నిర్వచించవద్దని ఆయన హితవు పలికారు.
తబితా సుకుమార్ సమర్పణలో, బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా డిసెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కథా నేపథ్యాన్ని, ఆ కాలమాన పరిస్థితులను బట్టే దర్శకుడు ఆ సన్నివేశాలను డిజైన్ చేసి ఉంటారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. సినిమా పూర్తి స్థాయిలో చూడకుండానే ముందస్తు నిర్ధారణకు రావడం సరికాదన్న వాదనకు వేణు ఉడుగుల మద్దతు తోడవడంతో ఈ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. వివాదాల నడుమ భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘ఇడుపు కాయితం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

