Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్‌.. ఊహించని ధర!

Varanasi Ott Deal

Varanasi Ott Deal

Varanasi OTT Deal: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ మూవీ డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వారణాసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుందట. అనంతరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో వివిధ ఫార్మాట్లకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమా విడుదలకు ముందే.. అన్ని సాంకేతిక పనులను సిద్ధం చేసేందుకు జక్కన్న బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు టాక్. ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఓటీటీ డీల్‌ను పూర్తి చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. వారణాసి డిజిటల్ హక్కులు ఏకంగా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రూ.290 కోట్లకు భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. ఇప్పుడు ఓటీటీ డీల్ రూ.400-450 కోట్ల వరకు పలికే అవకాశం ఉందని న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ నెలలోనే ఓటీటీ డీల్ ఖరారైతే.. 2027 ఏప్రిల్ 7నే విడుదల కానుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న వారణాసిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మరి నెట్‌ఫ్లిక్స్‌తో రూ.450 కోట్ల డీల్ నిజంగానే కుదురుతుందా? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.