Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?

Prithviraj Sukumaran's Kumbha Character

Prithviraj Sukumaran's Kumbha Character

Prithviraj Sukumaran’s Kumbha Character: బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణ: పార్ట్ 1’కు ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన దక్కుతోంది. నవంబర్ 5న రిలీజైన ఈ మూవీ.. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా విడుదలైన తర్వాత రామాయణ గాథకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా పైనా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా కథ, పాత్రల నేపథ్యంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.

తాజాగా రెడ్డిట్‌లో వారణాసిపై ప్రచారంలో ఉన్న ఓ స్టోరీ థియరీ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న ‘కుంభ’ పాత్రకు రామాయణంలోని కుంభకర్ణుడితో సంబంధం ఉండొచ్చని అంటున్నారు. కుంభకర్ణుడి పునర్జన్మగా కుంభ పాత్రను చూపించనున్నారనేది ఈ కథనం సారాంశం. రావణుడికి సంబంధించిన నవరత్న మాలను సొంతం చేసుకోవడమే కుంభ లక్ష్యమని ఈ థియరీలో పేర్కొంటున్నారు. ఆ నవరత్న మాలలోని తొమ్మిది శక్తివంతమైన రత్నాలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించేందుకు రుద్ర (మహేశ్ బాబు పోషిస్తున్న పాత్ర)ను కుంభ పంపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కథ అనేక దేశాలు, విభిన్న ప్రాంతాల నేపథ్యంలో సాగుతుందట.

వారణాసి కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం టైమ్ ట్రావెల్ ట్విస్ట్ అని మరో వెర్షన్ వైరల్ అవుతోంది. కథానాయకుడు ఒక వార్మ్‌హోల్ ద్వారా రామాయణ కాలానికి చేరుకుంటాడని, రామ-రావణ యుద్ధ సమయంలో జరిగిన కీలక సంఘటనలో జోక్యం చేసుకుంటాడట. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను మార్చడం ద్వారా నవరత్నాల భవిష్యత్తు కూడా మారుతుందని ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం రెడ్డిట్‌లో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలు, కథా సిద్ధాంతాలు మాత్రమే. మరి దర్శకధీరుడు రాజమౌళి తనదైన కథనంతో ఈ అంశాలను ఎలా మలుస్తారన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.