Site icon NTV Telugu

కత్తి మహేష్ మృతికి టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

Tollywood Pays Tribute to Kathi Mahesh

ప్రముఖ తెలుగు నటుడు, సినీ విమర్శకుడు, రాజకీయ విశ్లేషకుడు, రచయిత, దర్శకుడు కత్తి మహేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. జూన్ 26న చిత్తూరులోని తన స్వంత గ్రామానికి వెళ్తున్న కత్తి యాక్సిడెంట్ కు గురయ్యాడు. నెల్లూరు జిల్లాలో ఓ కంటైనర్ ను కత్తి మహేష్ కారు ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కత్తి మహేష్ ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే కంటికి, తల భాగానికి శస్త్ర చికిత్స చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి తొలి నుంచి సేవలు అందిస్తున్న కత్తి మహేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఖర్చుల నిమిత్తం 17 లక్షల ఆర్థిక సాయం కూడా చేసింది. ఈ నేపథ్యంలో నిదానంగా కత్తి మహేశ్ కోలుకుంటున్నాడనే అందరూ భావించారు. కానీ రక్త పోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఇతర అవయవాలకు ప్రమాదం వాటిల్లి కత్తి మహేశ్ కన్నుమూశాడని అతని మిత్రులు తెలిపారు.

Read Also : ఆ హీరోయిన్లతో రామ్… అనుకోకుండా కలిశారట..!

బిగ్ బాస్ హౌస్ లోనూ పాల్గొని అందరినీ ఆకట్టుకున్న కత్తి మహేశ్ కొన్ని సినిమాలలో నటించాడు. అలానే ‘మిణుగురులు’ చిత్రానికి సహ రచయితగా వ్యవహరించాడు. ‘జర్నలిస్ట్’, ‘పెసరట్టు’, ‘ఎగిసే తారాజువ్వలు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ మధ్య కత్తి మహేశ్ శ్రీరాముడి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపాయి. అలానే గతంలో అతని వల్ల సాంఘిక సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ పోలీసు శాఖ కొంతకాలం ఆయన్ని రాష్ట్రం నుండి బహిష్కరించింది. గతంలో జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్‌ ను విమర్శించి వార్తల్లో నిలిచారు. ఏదేమైనా ఆయన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం కత్తి అలవాటు. ఇటీవల తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీ కోసం ప్రచారం చేశాడు. నేడు కత్తి మహేష్ స్వగ్రామం చిత్తూరు జిల్లా యర్రావారి పాలెం మండలం యలమందలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ మృతికి సంతాపం తెలియజేస్తూ సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు.

Exit mobile version