NTV Telugu Site icon

పొరుగు దర్శకులపై టాలీవుడ్ హీరోల మొగ్గు!

Tollywood Heros interested in Other Languages Directors

తెలుగులో త్వరలో రాబోతున్న సినిమాలను, సెట్స్ పైకి వెళ్ళబోతున్న చిత్రాలను ఒకసారి గమనించండి… మీకో యూనిక్ పాయింట్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుండి నవతరం హీరోల వరకూ అందరూ పరభాషా దర్శకులవైపు మొగ్గు చూపుతున్నారు. మాతృకను డైరెక్ట్ చేశారనే కారణంగా కొందరికి ఇక్కడ అవకాశం ఇస్తుంటే… మన హీరోలను భిన్నంగా తెరపై ప్రజెంట్ చేస్తారనే నమ్మకంతో మరికొందరు ఛాన్స్ పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేయబోతున్న సినిమా ‘లూసిఫర్’. నిజానికి మలయాళంలో దీనిని నటుడు పృథ్వీరాజ్ డైరెక్ట్ చేశాడు. కానీ తెలుగు రీమేక్ దగ్గరకు వచ్చే సరికీ ప్రముఖ నిర్మాత, ఎడిటర్ మోహన్ తనయుడు రాజా చేతిలో ఈ ప్రాజెక్ట్ ను పెట్టారు. అతను గతంలో తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ మూవీ తీశాడు. ఇక ‘దృశ్యం 2’ను తెలుగులో రీమేక్ చేయాలని భావించిన వెంకటేశ్ మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసేఫ్ నే రంగంలోకి దించాడు. ఇక ప్రభాస్ అయితే… సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’ను, ఓంరౌత్ తో ‘ఆది పురుష్’ మూవీని చేస్తున్నాడు. రామ్ సైతం తమిళ దర్శకుడు లింగుస్వామితో ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది ‘క్లాప్’ అనే సినిమాను తమిళ దర్శకుడు పృథ్వీ ఆదిత్యతో చేస్తున్నాడు. అలానే ‘పుష్ప’ చిత్రం పూర్తి కాగానే అల్లు అర్జున్ సైతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడన్నది తాజా సమాచారం. మొత్తం మీద మన స్టార్ హీరోలు అందరూ పొరుగు దర్శకుల ప్రతిభా పాటవాల మీద భలే గురి పెంచుకున్నారు. మరి వారి నమ్మకానికి తగ్గ ఫలితాలు దక్కితే మంచిదే!