నెలకు కేవలం రూ.10 సబ్‌స్క్రిప్షన్ ఫీజుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘టిబిడి’ (త్రిభాణధారి) అధికారికంగా లాంచ్ అయింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ర్యాప్చీ సంస్థ రూపొందించిన ఈ ఓటీటీ, భారతీయ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారీ సంచలనం సృష్టించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే దుబాయ్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైన టిబిడి, ఇప్పుడు భారత్‌లో రూట్ లెవెల్ వరకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో లోగో లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు టిబిడి ఫౌండర్ & ఎండీ ధర్మ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీతో పాటు దర్శకులు వి. సముద్ర, వీ. ఎన్డ్. ఆదిత్య, ఇ. సత్తిబాబు, నిర్మాత డి.యస్.రావు తదితరులు హాజరయ్యారు. ప్రధాన అతిథిగా నిర్మాత కె.కె. రాధామోహన్ చేతుల మీదుగా యాప్ లాంచ్ జరిగింది.
ఈ సందర్భంగా టిబిడి ఫౌండర్ ధర్మ్ గుప్తా మాట్లాడుతూ, “టిబిడి ద్వారా మన దేశీయ కంటెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలన్నది మా లక్ష్యం. కుటుంబమంతా కలిసి చూడగలిగే స్వచ్ఛమైన కంటెంట్ మాత్రమే ఇక్కడ ఉంటుంది. సెక్స్ లేదా వల్గారిటీ లేని, అన్ని భాషల పాత-కొత్త సినిమాలను స్వాగతిస్తాం. ప్రపంచంలోనే మొదటిసారి కేవలం ₹10 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో ఓటీటీ అందుబాటులోకి వస్తోంది. చిన్న నిర్మాతలకు పెద్ద పీఠ వేస్తాం. మంచి కంటెంట్‌ను నమ్మి ముందుకు వెళ్తాం” అని అన్నారు.
టిబిడి సౌత్ సీఈఓ డి.యస్.రావు మాట్లాడుతూ, “30 ఏళ్ల అనుభవంలో చిన్న నిర్మాతలు ఓటీటీ బిజినెస్ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు నాకు తెలుసు. వారికి ఇది పెద్ద అవకాశమవుతుంది. పేమెంట్స్ విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తాం. మంచి సినిమాలు, కంటెంట్ టిబిడిని టాప్ రేంజ్‌కి తీసుకెళ్లగలవు” అని తెలిపారు. అలాగే..
సౌత్ సీఈఓ వి. సముద్ర మాట్లాడుతూ, “టిబిడి త్వరలోనే పెద్ద ఓటీటీలకు సమానంగా ఎదుగుతుందని నమ్ముతున్నాను. నిర్మాతలకు, కంటెంట్ క్రియేటర్లకు మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, షోలు భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ను తీసుకుంటాం. భవిష్యత్తులో ఆడియో రంగంలోకి కూడా అడుగుపెడతాం” అని చెప్పారు. ముఖ్య అతిథి కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ, “చిన్న నిర్మాతలకు ఇది పెద్ద అండగా నిలుస్తుంది. ₹10 సబ్‌స్క్రిప్షన్‌తో పెద్ద మార్కెట్‌ను ఆకర్షించవచ్చు. మంచి కంటెంట్ సృష్టించే వారికి ఇది గొప్ప వేదిక అవుతుంది” అని అభిప్రాయపడ్డారు.
